ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ బౌలర్లు రెచ్చిపోయారు. ముష్ఫికర్ రహీం (106), లిటన్ దాస్ (128) సెంచరీల సాయంతో భారీ స్కోర్ (476) చేసిన అనంతరం ప్రత్యర్ధిని ఉక్కిరిబిక్కిరి చేశారు.
హసన్ మురద్ 2, ఖలీద్ అహ్మద్, తైజుల్ ఇస్లాం, మెహిది హసన్ తలో వికెట్ తీయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది.
ఆండ్రూ బల్బిర్నీ (21), పాల్ స్టిర్లింగ్ (27), కేడ్ కార్మికెల్ (17), హ్యారీ టెక్టార్ (14), కర్టిస్ క్యాంఫర్ (0) ఔట్ కాగా.. లోర్కన్ టక్కర్ (11), స్టీఫెన్ డోహ్ని (2) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఐర్లాండ్ ఇంకా 378 పరుగులు వెనుకపడి ఉంది.
అంతకుముందు కెరీర్‌లో వందో టెస్ట్ ఆడుతున్న ముష్ఫికర్ సెంచరీతో కదంతొక్కాడు. మరో శతక వీరుడు లిటన్ దాస్‌తో కలిసి ఐదో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ముష్ఫికర్ ఔటైన అనంతరం దాస్ మెహిది హసన్‌తో (47) కలిసి మరో కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ (63) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు మహ్మదుల్ జాయ్ (34), షద్మాన్ ఇస్లాం (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో ఆండీ మెక్‌బ్రైన్ 6 వికెట్లతో సత్తా చాటాడు.
కాగా, ఐర్లాండ్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందిన బంగ్లా 1-0తో ఆధిక్యంలో కొనసాగుతుంది.
చదవండి: IPL 2026 Auction: ఫ్రాంచైజీల బలహీనతలు, లోటుపాట్లు


