source: X
ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో ఇవాళ మొదలైన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత అండర్ 19 బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా స్పిన్నర్ తన్మయ్ బలోడా (25-11-32-6) చెలరేగడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌటైంది. బలోడాతో పాటు అయాన్ అక్రమ్ (2-45), మోహిత్ ఉల్వా (1-38), ప్రియాన్షు సింగ్ (1-21) రాణించడంతో ఆసీస్ కనీసం 200 పరుగుల మార్కును కూడా తాకలేకపోయింది.
ఆ జట్టు తరఫున 37 పరుగులు చేసిన చార్లీ హెండర్సన్ టాప్ స్కోరర్‌గా కాగా.. నీల్ పటేల్ (31), జేకబ్ పీట్జ్ (26), ప్యాట్రిక్ సుల్లివాన్ (20), థామస్ వసియో (14) రెండంకెల స్కోర్లు చేశారు.
కాగా, ఆస్ట్రేలియా అండర్ 19 జట్టు మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను భారత యువ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం జరిగిన తొలి టెస్ట్‌లోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది.
ఇదీ చదవండి: కీలక టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా భువీ


