
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా (WI vs AUS 2nd Test) ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును 133 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కంగారూ జట్టు కైవసం చేసుకుంది. కాగా మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా వెస్టిండీస్‌కు వెళ్లింది.
రెండో టెస్టులోనూ
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టెస్టు సిరీస్ ఆరంభం కాగా.. బార్బడోస్‌లో మొదటి టెస్టు జరిగింది. ఇందులో ఆరంభంలో అదరగొట్టిన విండీస్.. ఆ తర్వాత చెత్త ప్రదర్శనతో 159 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా గ్రెనెడా వేదికగా రెండో టెస్టులోనూ వెస్టిండీస్‌కు భంగపాటే ఎదురైంది.
సెయింట్ జార్జెస్ మైదానంలో మరోసారి బ్యాటర్ల వైఫల్యం కారణంగా విండీస్... ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం నాటి ఆట సందర్భంగా.. ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది వెస్టిండీస్.
143 పరుగులకు ఆలౌటై
ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (7), జాన్ కాంప్‌బెల్ (0)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ (10) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో నంబర్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ (14)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ షాయీ హోప్ (17), జస్టిన్ గ్రీవ్స్ (2) చేతులెత్తేశారు.
ఇక కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (34) విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. టెయిలెండర్లు అల్జారీ జోసెఫ్ 13, షమార్ జోసెఫ్ 24, జేడన్ సీల్స్ 8 పరుగులు చేశారు. ఆండర్సన్ ఫిలిప్ 11 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో 34.3 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైన విండీస్.. 133 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ (Nathon Lyon) మూడేసి వికెట్లు పడగొట్టగా... జోష్ హాజిల్‌వుడ్ (Josh Hazlewood) రెండు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, బ్యూ వెబ్‌స్టర్ చెరో వికెట్ కూల్చారు. ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 221/7తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 71.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (71; 7 ఫోర్లు, 1 సిక్స్), కామెరాన్ గ్రీన్ (52; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఈ సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు ఈనెల 13 నుంచి కింగ్‌స్టన్‌లో జరుగుతుంది.
వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టు
👉వేదిక: సెయింట్ జార్జెస్, గ్రెనెడా
👉టాస్: ఆస్ట్రేలియా- తొలుత బ్యాటింగ్
👉ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 286
👉విండీస్ తొలి ఇన్నింగ్స్: 253
👉ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 243
👉విండీస్ రెండో ఇన్నింగ్స్: 143
👉ఫలితం: 133 పరుగుల తేడాతో విండీస్‌పై ఆసీస్ గెలుపు.. సిరీస్ 2-0తో కైవసం
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అలెక్స్ క్యారీ (63, 30 రన్స్).
చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్