
ఏషియన్ వాలీబాల్ టోర్నీలో కాంస్య పతకం సాధించిన అట్టాడ చరణ్
థాయ్‌లాండ్‌లో జరిగిన పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచిన భారత్
అభినందించిన వాలీబాల్ సంఘ నాయకులు, క్రీడాకారులు
శ్రీకాకుళం న్యూకాలనీ: పలాస మండలం అంతరకుడ్డ గ్రామానికి చెందిన వాలీబాల్ కుర్రాడు అట్టాడ చరణ్ అదరగొట్టాడు. అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన మొదటి టోర్నీలోనే జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి కాంస్య పతకం సాధించి శభాష్ అనిపించాడు. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు థాయిలాండ్ వేదికగా ప్రతిష్టాత్మక 2వ ఏషియన్ అండర్ –16(మెన్) వాలీబాల్ చాంపియన్‌షిప్ –2025 పోటీలు జరిగాయి. ఇందులో త్రుటిలో ఫైనల్ బెర్త్‌ను కోల్పోయిన భారత జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించిన సిక్కోలు క్రీడాతేజం చరణ్ కాంస్య పతకం సాధించాడు. జట్టు విజయంలో కీలకభూమిక వహించిన చరణ్ ప్రతిభను జట్టు యాజమాన్యం, ఇండియన్ వాలీబాల్ ఫెడరేషన్ ప్రసంశించింది. అంతకుముందు ఈ నెల 10వ తేదీ వరకు బెంగళూరు వేదికగా ఎన్.ఎస్.ఎస్.సి. అకాడమీలో జరిగిన శిక్షణా శిబిరాల్లో మంచి క్రమశిక్షణతోపాటు అత్యుత్తమ ఆటతీరుతో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు.
అంతరకుడ్డ నుంచి అంతర్జాతీయ పోటీలకు..
చరణ్ తల్లిదండ్రులు అట్టాడ కమల్‌నాదమ్, దేవి. వీరిది వ్యవసాయ కుటుంబం. చరణ్ విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఉన్న సాయ్ స్పోర్ట్స్ స్కూల్/హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి పూర్తిచేశాడు. ఇంటర్మీడియెట్‌లో ప్రవేశం పొందనున్నాడు. అన్నయ్య భార్గవ్ ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాడు. మావయ్య రవి ప్రేరణ.. కోచ్ సత్యనారాయణ ప్రోత్సాహంతో రాణించగలుగుతున్నానని చెబుతున్నాడు. 2025లో ఢిల్లీలో జరిగిన సీబీఎస్సీ నేషనల్స్ వాలీబాల్ స్కూల్‌గేమ్స్‌లో కాంస్య పతకం సాధించగా, గత ఏడాది 2024లో జార్ఖండ్‌లో జరిగిన సీబీఎస్సీ నేషనల్స్‌లో ప్రాతినిధ్యం వహించి సత్తాచాటాడు.
అభినందనల వెల్లువ..
సిక్కోలు నుంచి ఏషియన్ వాలీబాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా కాంస్య పతకం సాధించడం పట్ల క్రీడావర్గాల్లో సర్వాత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.వాలీబాల్ జిల్లా కార్యదర్శి కె.రామచంద్రుడు, ఉపాధ్యాక్షులు వై.పోలినాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్వీ రమణ, టి.రవి, సలహాదారు పి.సుందరరావు, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, ఎం.సాంబమూర్తి, బి.సతీష్, డీఎస్‌డీఓ డాక్టర్ కె.శ్రీధర్‌రావు, కోచ్ కె.హరికృష్ణ, వాలీబాల్ సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.
సంతోషంగా ఉంది..
అంతర్జాతీయ ఏషియన్ వాలీబాల్ మీట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉంది. అందులోను మెడల్ సాధించడం సంతోషంగా ఉంది. సీనియర్ నేషనల్స్ ఆడి దేశానికి రిప్రజెంట్ చేయాలనేది నా కళ. ఇందుకు అహర్నిశలు కృషి చేస్తా.
– అట్టాడ చరణ్, వాలీబాల్ క్రీడాకారుడు