దారికాచిన మృత్యువు
● జమ్ము వద్ద రోడ్డు ప్రమాదం ● వృద్ధురాలు దుర్మరణం
నరసన్నపేట : పాతపట్నం మండలం తిడ్డిమికి చెందిన దువ్వారి జానకమ్మ(60) అనే వృద్ధురాలు జమ్ము గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. సోదరుడు తూలుగు దుర్యోధనరావు హస్తికలను శ్రీకూర్మంలో కలిపేందుకు బంధువులతో కలిసి గురువారం వేకువజామున ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన చోసుకుంది. జమ్ము గ్రామానికి ముందు ఆటో ఆపి రోడ్డుకు మరో వైపు కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి ఆటో వద్దకు వస్తుండగా పాతపట్నం వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో పైకి ఎగిరిన ఆమె కారు బోనెట్‌పైనుంచి రోడ్డుమీదకు తుళ్లిపడింది. కాలు, తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. జానకమ్మ మృతితో తిడ్డిమి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. జానకమ్మ కుమార్తె గుంపు శ్రీలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్సై బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దారికాచిన మృత్యువు


