నో స్టాక్‌ | - | Sakshi
Sakshi News home page

నో స్టాక్‌

Apr 3 2026 7:08 AM | Updated on Apr 3 2026 7:08 AM

పొందూరులో నో స్టాక్‌ బోర్డు

ఎన్నాళ్లో మాకీ కష్టాలు...

గ్యాస్‌ బుక్‌ చేసి 20 రోజులు పైనే అయింది. ఇప్పటి వరకు రాలేదు. అందుకే వచ్చాను. ఏమిటో మాకీ కష్టాలు. ఇక్కడికి వస్తే సమాధానం చెప్పే వారే కరువయ్యారు. ఎన్నాళ్లో ఈ పరిస్థితి. ఆటోలు మీద ఖాళీ బండలు పట్టుకుని వస్తున్నాం.

– మెట్ట శాంతమ్మ,

నో స్టాక్‌ అంటున్నారు..

ఎప్పుడొచ్చినా కారణాలు చెబుతూనే ఉన్నారు. పనులు మానుకుని వస్తున్నాం. రోజంతా గ్యాస్‌ ఆఫీస్‌ వద్ద పడిగాపులు కాస్తున్నా ఫలితం ఉండడం లేదు. నో స్టాక్‌ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఇంటిదగ్గర నుంచి గ్యాస్‌ బండ పట్టుకుని ఆటోలో 120 రూపాయలు ఖర్చు పెట్టి వస్తున్నాం. వస్తున్న గ్యాస్‌ ఎటో వెళుతుందో తెలియడం లేదు. మా పరిస్థితిని అర్థం చేసుకుని మా గ్యాస్‌ కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

– పొందూరు మండలం తోలాపి గ్రామానికి

చెందిన ఓ వినియోగదారుడి ఆవేదన ఇది.

పల్లెల్లో గ్యాస్‌ కష్టాల తీవ్రతకు నిదర్శనమీ చిత్రం. బుక్‌ చేసినా ఇవ్వడం లేదని పొందూరు ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులు ఖాళీ సిలిండర్లు తెచ్చి వరుసగా పెట్టారు. ఓటీపీ వచ్చిన 15 రోజుల వరకు సిలిండర్‌ రాకపోవడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. వినియోగదారుల ఒత్తిడి, సిలిండర్ల సరఫరా లేకపోవడమో గానీ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు కూడా నోస్టాక్‌ బోర్డు పెట్టేశారు. దీంతో వినియోగదారులు వాదనకు దిగుతున్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో గ్యాస్‌ కొరత తీవ్రమవుతోంది. ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు గృహ వినియోగదారులకు కూడా గ్యాస్‌ దొరకడం లేదు. ఫోన్‌ ద్వారా బుక్‌ చేద్దామంటే కావడం లేదు. ఆన్‌లైన్‌లో ప్రయత్నించినా జరగడం లేదు. జరిగినా 15 నుంచి 20 రోజులైతే గానీ బండ ఇంటికి రావడం లేదు. గ్యాస్‌ ఏజెన్సీల నుంచి నో రెస్పాన్స్‌ వస్తోంది. గ్యాస్‌ కొరత లేదని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సిలిండర్లు దొరకని పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ కష్టాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వాణిజ్య సిలిండర్ల సరఫరాను ఆయా కంపెనీలు నిలిపివేయడంతో హోటల్స్‌ నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్యాస్‌ కష్టాల నుంచి గట్టెక్కేందుకు కొందరు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ నిర్వహణ సాగిస్తున్నారు. మరికొందరు పాత పద్ధతిలో ఊక పొయ్యిలను వినియోగిస్తున్నారు. కట్టెలు, ఊక సక్రమంగా దొరకని చోట ఏకంగా హోటల్స్‌ మూసేస్తున్నారు. పలుకుబడి ఉన్న హోటల్స్‌ యజమానులకు మాత్రం గుట్టుగా సిలిండర్లు వచ్చేస్తున్నాయి. అవి కమర్షియల్‌ సిలిండర్లా? డొమెస్టిక్‌ సిలిండర్లా? తెలీదు గానీ వారికి మాత్రం గ్యాస్‌ సమస్య అంతగా ఉండటం లేదు. తోపుడు బళ్లు, చిన్న హోటల్స్‌ మాత్రం మూతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5వేలకు పైగా హోటళ్లు ఉన్నాయి. వీటిలో సింగిల్‌ డిజిట్‌లో తప్ప మిగతా హోటల్స్‌ అన్నీ ఇబ్బందులు పడుతున్నాయి.

జేసీ మీటింగ్‌కు డీలర్లు డుమ్మా..

శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సంబంధించిన గ్యాస్‌ ఏజెన్సీ డీలర్లతో జాయింట్‌ కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఐదు ఏజెన్సీలకు గాను రెండు ఏజెన్సీలకు సంబంధించిన డీలర్లు మాత్రమే హాజరయ్యారు. మిగతా మూడు గ్యాస్‌ ఏజెన్సీల డీలర్లు రాకుండా వారికి సంబంధించిన సిబ్బందిని పంపించారు. చెప్పాలంటే జేసీ ఆదేశాలను లెక్క చేయనట్టు స్పష్టమైంది. జేసీ సమీక్ష చేసినప్పటికీ వారి దగ్గర సరైన సమాధానాలు రాలేదని తెలిసింది. ఒక భారత గ్యాస్‌ ఏజెన్సీ, మరో హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీ ప్రతినిధులపై జేసీ సీరియస్‌ అయినట్టు తెలిసింది. పంపిణీ సక్రమంగా చేయాలని? లేదంటే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించినట్టు తెలిసింది. ఇకపై గ్యాస్‌ ఏజెన్సీలు విక్రయించే ప్రతి కమర్షియల్‌ సిలిండర్‌కు సంబంధించి రశీదు చూపించాలని, ఎవరికి విక్రయిస్తున్నారో పౌరసరఫరాల శాఖకు తెలియ జేయాలని, ఒక పర్యవేక్షక అధికారిని కూడా నియమిస్తున్నట్టు గురువారం జరిగిన సమీక్షలో స్పష్టం చేసినట్టు సమాచారం. మొత్తానికి అటు డొమెస్టిక్‌, ఇటు కమర్షియల్‌ సిలిండర్ల పంపిణీ ఒక మిస్టరీగా మారిపోయింది. కొరతను అవకాశంగా తీసుకుని కొన్ని ఏజెన్సీలు బ్లాక్‌లో సిలిండర్లను విక్రయిస్తున్నాయి. వాస్తవ ధరకు రెట్టింపు వేసి విక్రయిస్తున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కమర్షియల్‌ సిలిండర్లు అయితే రూ. 3,500 వరకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. డొమెస్టిక్‌ సిలిండర్లను కూడా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఎక్కడికక్కడ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. బుక్‌ చేసిన 15రోజుల వరకు గ్యాస్‌ రాకపోవడంతో.. రద్దీని ఆసరాగా తీసుకుని తమ వద్ద సిలిండర్లను ఎక్కువ ధరకు విక్రయించి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

తీవ్రమవుతున్న గ్యాస్‌ కొరత

ఎక్కడికక్కడ నో స్టాక్‌ బోర్డులు

గగ్గోలు పెడుతున్న వినియోగదారులు

కమర్షియల్‌ గ్యాస్‌ కొరతతో మూతపడుతున్న హోటల్స్‌

బుక్‌ చేసి 15 రోజులు దాటినా రాని డొమెస్టిక్‌ గ్యాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement