● పల్లె పంచాయతీ ఎన్నికల వేడి ● ఏప్రిల్ 2తో ముగియనున్న
అక్కడ ఎన్నికల్లేవ్..!
అరసవల్లి: పల్లెల్లో ‘స్థానిక’ ఎన్నికల వాతావరణం వేడెక్కనుంది. 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ కాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) సం‘గ్రామానికి’ సన్నాహాలు మొదలుపెట్టింది. గతేడాది సెప్టెంబర్ 3నే స్థానిక ఎన్నికల నిర్వహణకు తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసిన సంగతి విదితమే. తాజాగా వచ్చే నెల అంటే మార్చి 9 నాటికి జిల్లాలో పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం వివిధ రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. జిల్లా నుంచి ముగ్గురికి సాంకేతిక అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చేసింది. రానున్న ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఇప్పటికే జిల్లాలో అధికార, ప్రతిపక్షానికి చెందిన మద్దతుదారులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. రాజకీయ పార్టీ ప్రమేయాలుండవని చెబుతున్నా...పరోక్షంగా రాజకీయ ఎన్నికలే అని చెప్పకతప్పదు. తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలిస్తున్న తీరు చూస్తుంటే ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతిచ్చే వారికి జనం గుణపాఠం చెప్పేలా ఉన్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి.
ప్రక్రియ ప్రారంభం
జిల్లాలో 2021 ఏప్రిల్ 3 నుంచి గ్రామ పంచాయతీల్లో పాలన మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్ 2తో పదవీ కాలం ముగియనుంది. నిర్ణీత సమయంలోపే గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా చేపట్టాల్సిన ప్రక్రియలను పూర్తి చేసేందుకు ఎస్‌ఈసీ చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది జనవరి 1 వరకు అసెంబ్లీ ఓటరు జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా జాబితాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా పంచాయతీ అధికారి కె. భారతీ సౌజన్య ఆధ్వర్యంలో పంచాయతీలు, వార్డులు, ఓటర్లు, సామాజిక వర్గాల వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
కొత్త పంచాయతీలపై స్పష్టత కరువు..
జిల్లాలో 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మొత్తం 38 మండలాల్లో ఎన్నికలు నిర్వహించగా.. జిల్లాల విభజన నేపథ్యంలో ఈసారి 30 మండలాల పరిధిలో 912 గ్రామ పంచాయతీల్లో మొత్తం 8487 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 15.54 లక్షల మంది గ్రామీణ ఓటర్లుగా గుర్తించారు. కొత్త పంచాయతీల ఏర్పాటు దిశగా ప్రతిపాదనలను ఆహ్వానిస్తే జిల్లాలో కొత్తగా 64 ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తే ఇందులో 35 పంచాయతీల ప్రతిపాదనలకు మాత్రమే కమిషనరేట్ నుంచి ప్రస్తుతానికి ఆమోదం లభించింది. అయితే ప్రభుత్వం నుంచి గెజిట్ వచ్చేంతవరకు ఈ
ప్రక్రియ కాగితాల్లోనే ఉంటుంది. దీంతో ప్రతిపాదిత కొత్త పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు.
2021 నాటి స్థానిక ఎన్నికల ప్రకారం మొత్తం 912 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా.. వివిధ కారణాలతో పలు చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా చోట్ల ఎన్నికలు నిర్వర్తించాల్సి ఉండగా.. మరో నెలన్నర రోజుల్లో ముగుస్తుండటం గమనార్హం. వివిధ కారణాలతో 25 పంచాయతీల్లో సర్పంచ్‌ల స్థానాలకు, 24 పంచాయతీల్లో వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలను పూర్తిగా నిర్వహించలేదు. కోటబొమ్మాళి మండలం పట్టుపురం గ్రామానికి గత రెండు విడతల్లోనూ సర్పంచ్ స్థానానికి రిజర్వేషన్ (ఎస్టీ–మహిళ) ప్రకారం అభ్యర్థి దొరకలేదు. ఈ పంచాయతీలో వార్డు సభ్యులు మాత్రం ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 13 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు చెక్‌పవర్ రద్దు చేశారు. వివిధ కారణాలతో తోటాడ (ఆమదాలవలస), కిష్టప్పపేట (శ్రీకాకుళం రూరల్), నువ్వలరేవు (వజ్రపుకొత్తూరు) సర్పంచ్‌లు పదవికి రాజీనామాలు చేస్తే.. మరో 13 చోట్ల సర్పంచ్ స్థానాలు, 114 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి.


