Asia cup 2025: ఉత్కంఠ పోరు.. సూపర్‌ ఓవర్‌లో శ్రీలంకపై టీమిండియా గెలుపు | Asia cup 2025: India beat Sri lanka in super over | Sakshi
Sakshi News home page

Asia cup 2025: ఉత్కంఠ పోరు.. సూపర్‌ ఓవర్‌లో శ్రీలంకపై టీమిండియా గెలుపు

Sep 27 2025 12:39 AM | Updated on Sep 27 2025 12:39 AM

Asia cup 2025: India beat Sri lanka in super over

ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్‌ 26న జరిగిన చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు (202/5) సమమయ్యాయి. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది.

ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక పేలవంగా 5 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం​ భారత్‌ తొలి బంతికే 3 పరుగులు తీసి విజయం సాధించింది. ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్‌ ఇదివరకే ఫైనల్‌కు చేరింది. సెప్టెంబర్‌ 28న జరిగే ఫైనల్లో భారత్‌, పాకిస్తాన్‌ తలపడనున్నాయి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. అభిషేక్‌ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 ఫోర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలక్‌ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌), సంజూ శాంసన్‌ (23 బంతుల్లో 39; ఫోర్‌, 3 సిక్సర్లు) రాణించారు.

ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (15 బంతుల్లో 21 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (12), హార్దిక్‌ పాండ్యా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, షనక, అసలంక తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా భారత్‌ చేసినంత స్కోరే చేసింది. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక వీరోచిత శతకంతో (58 బంతుల్లో 107; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కుసాల్‌ మెండిస్‌ (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో చివరి వరకు లంక గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు.

అయితే నిస్సంక సెంచరీ అనంతరం 19వ ఓవర్‌ తొలి బంతికి ఔట్‌ కావడంతో సీన్‌ మారిపోయింది. శ్రీలంక లక్ష్యానికి పరుగు దూరంలో నిలిచిపోయింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. ఇందులో భారత్‌ శ్రీలంకపై విజయం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement