
ఆసియా కప్ 2025లో భాగంగా రేపు (సెప్టెంబర్ 21) భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ పంచ్ పడినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీలో భారత్‌తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న షేక్ హ్యాండ్ వివాదంలో పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.
ఆ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వలేదు (టాస్ సందర్భంగా, మ్యాచ్ అయిపోయాక). దీన్ని అవమానంగా భావించిన పీసీబీ భారత ఆటగాళ్లను ఏమీ చేసుకోలేక, మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌పై పడింది. పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్ల పట్ల పక్షపాతంగా (తమ ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వరన్న భారత మేనేజ్‌మెంట్ సందేశాన్ని పాక్ కెప్టెన్‌కు చేరవేశాడని) వ్యవహరించి, క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని ఆరోపించింది.
ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐసీసీకి పలు లేఖలు రాసింది. యూఏఈతో మ్యాచ్‌కు ముందు ఓ అడుగు ముందుకేసి బాయ్‌కాట్ బెదిరింపులకు దిగింది. ఐసీసీ కన్నెర్ర చేయడంతో కనీసం తమ మ్యాచ్‌లకైనా పైక్రాఫ్ట్‌ను పక్కన పెట్టాలని కాళ్ల బేరానికి వచ్చింది.
పీసీబీ ఉడత ఊపులను, డిమాండ్లను తోసిపుచ్చిన ఐసీసీ, పైక్రాఫ్ట్‌కు మద్దతుగా నిలిచింది. అతన్నే యూఏఈతో మ్యాచ్‌కు రిఫరీగా కొనసాగించింది. ఒకవేళ పాక్ జట్టు ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలనుకుంటే భారీ మొత్తంలో నగదు చెల్లించాలని రివర్స్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతటితో ఆగకుండా తాజాగా మరో షాక్ ఇచ్చింది.
గత మ్యాచ్ తాలూకా గాయాలు తగ్గకముందే రేపు భారత్‌తో జరుగబోయే సూపర్-4 మ్యాచ్‌కు మరోసారి పైక్రాఫ్ట్‌నే రిఫరీగా నియమించింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ మేరకు ఐసీసీ ఇదివరకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఐసీసీ కొట్టిన ఈ చావుదెబ్బకు సూపర్-4 మ్యాచ్‌కు ముందే పాక్ ఢీలా పడిపోయింది.
కాగా, రేపటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.