
సమిత్- అర్జున్ (PC: Instagram)
భారత క్రికెట్ దిగ్గజాల్లో సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)లకు ప్రత్యేక స్థానం ఉంది. శతక శతకాల ధీరుడిగా సచిన్ చెక్కుచెదరని ప్రపంచ రికార్డు సాధిస్తే.. ద్రవిడ్ ‘ది వాల్’గా టీమిండియా టెస్టు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ ఇద్దరు కెప్టెన్లుగానూ భారత జట్టును ముందుండి నడిపించారు.
ఇక ఈ క్రికెట్ దిగ్గజాల వారసత్వాన్ని కొనసాగించేందుకు వారి కుమారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
మరోవైపు.. రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ (Samit Dravid) కూడా తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌తో పాటు భారత యువ జట్టు తరఫున కూడా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు.
ద్రవిడ్ వర్సెస్ టెండుల్కర్
ఈ క్రమంలో సచిన్- ద్రవిడ్‌ల వారసులు తాజాగా ఓ మ్యాచ్ సందర్భంగా ముఖాముఖి పోటీపడ్డారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) డాక్టర్ కె. తిమ్మప్పయ్య మెమొరియల్ టోర్నమెంట్ పేరిట ఓ రెడ్‌బాల్ ఇన్విటేషనల్ టోర్నీ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో అర్జున్ టెండుల్కర్ తన దేశీ జట్టు గోవాకు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. సమిత్ ద్రవిడ్ సొంత జట్టు KCSA సెక్రటరీస్ ఎలెవన్‌కు ఆడుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఇరుజట్లు ముఖాముఖి తలపడగా.. సమిత్ ద్రవిడ్ ఆరంభంలో బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. కానీ 26 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలు బాది 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అర్జున్ టెండుల్కర్ బౌలింగ్‌లో కశాబ్ బాక్లేకు క్యాచ్ ఇవ్వడంతో సమిత్ ద్రవిడ్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
ఇద్దరూ ఆల్‌రౌండర్లే
ఇలా టీమిండియా దిగ్గజాల వారసులు ప్రత్యర్థులుగా ఎదురుపడటం... అందులోనూ టెండుల్కర్ కుమారుడు అర్జున్.. ద్రవిడ్ కొడుకు సమిత్‌ను అవుట్ చేయడం ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది.
కాగా కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల సమిత్ ద్రవిడ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. కుడిచేతి వాటం కలిగిన ఈ బ్యాటర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా!.. ఇక ముంబై ఆటగాడు అర్జున్ టెండుల్కర్ బౌలింగ్ ఆల్‌రౌండర్.
పాతికేళ్ల అర్జున్ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. అదే విధంగా లెఫ్టాండ్ బ్యాటర్. ఇటీవలే అతడి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ముంబై వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు సానియా చందోక్‌తో అతడు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.