టైటిల్‌ పోరుకు ఆండ్రీవా, చావ్లిన్‌స్కా | Andreeva vs Chwalinska to battle for French Open title | Sakshi
Sakshi News home page

టైటిల్‌ పోరుకు ఆండ్రీవా, చావ్లిన్‌స్కా

Jun 5 2026 4:21 AM | Updated on Jun 5 2026 4:21 AM

Andreeva vs Chwalinska to battle for French Open title

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఎనిమిదో సీడ్‌ మిరా ఆండ్రీవా (రష్యా), క్వాలిఫయర్‌ మాయ చావ్లిన్‌స్కా (పోలాండ్‌) టైటిల్‌ పోరుకు దూసుకొచ్చారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఆండ్రీవా 76 నిమిషాల్లో 6–1, 6–3తో 15వ సీడ్‌ మార్టా కొస్టుక్‌ (ఉక్రెయిన్‌)ను ఓడించగా... ప్రపంచ 114వ ర్యాంకర్‌ చావ్లిన్‌స్కా 2 గంటల 10 నిమిషాల్లో 7–6 (7/4), 6–4తో ప్రపంచ 23వ ర్యాంకర్‌ డియానా ష్నైడర్‌ (రష్యా)పై గెలుపొందింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఆండ్రీవా, చావ్లిన్‌స్కాలకిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 

ష్నైడర్‌ను ఓడించిన క్రమంలో చావ్లిన్‌స్కా ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి క్వాలిఫయర్‌గా గుర్తింపు పొందింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల చరిత్రలో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా చావ్లిన్‌స్కా నిలిచింది. 2021 యూఎస్‌ ఓపెన్‌లో బ్రిటన్‌ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను క్వాలిఫయర్‌ హోదాలో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను సాధించి సంచలనం సృష్టించింది. 

శనివారం జరిగే ఫైనల్లో చావ్లిన్‌స్కా విజేతగా నిలిస్తే రాడుకాను సరసన చేరుతుంది. క్లే కోర్టు సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోని కొస్టుక్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆండ్రీవా పూర్తి ఆధిపత్యం చలాయించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసిన ఆండ్రీవా 14 విన్నర్స్‌ కొట్టింది. మరోవైపు కొస్టుక్‌ 34 అనవసర తప్పిదాలు చేసింది. ష్నైడర్‌తో జరిగిన మ్యాచ్‌లో చావ్లిన్‌స్కా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేయడంతోపాటు 32 విన్నర్స్‌ కొట్టింది. ష్నైడర్‌ 33 అనవసర తప్పిదాలు చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement