ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025లో భారత్–పాక్ మధ్య జరిగిన హై–వోల్టేజ్ పోరులో పాకిస్థాన్ యువ జట్టు ఆధిపత్యం చాటుకుంది. టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి పాక్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో మరో విలువైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025 టోర్నమెంట్‌లో అత్యంత ఆసక్తికరమైన పోరు జరిగింది.
యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో నేడు (ఆదివారం) భారత్–పాకిస్థాన్ జట్లు పరస్పరం తలపడ్డాయి కానీ ఈ కీలక మ్యాచ్‌ను గెలిచి పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ సమీకరణలను సులభం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతుందనిపించినా మధ్య ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనైంది.
దాంతో నిర్ణీత 19 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్స్ ధాటిగా ఆడి మ్యాచ్‌ను వేగంగా తమ వైపుకు తిప్పుకున్నారు. ఫలితంగా పాకిస్థాన్ జట్టు కేవలం 13.2 ఓవర్లలోనే నిర్ణీత లక్ష్యాన్ని చేధించింది.
పాక్ A జట్టు ఓపెనర్ మాజ్ సదాఖత్ (79*) పరుగులతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో పాకిస్థాన్ సెమీస్‌కు క్వాలిఫై అయింది. రెండో బెర్తు కోసం భారత్ Aతో పాటు ఒమన్ A బరిలో ఉంది. ఈ నెల 18న తదుపరి మ్యాచ్‌లో ఒమన్‌తోనే భారత్ A తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్ సెమీస్‌కు వెళ్లిపోతుంది.


