లార్డ్స్‌లో అతడి పోరాటం అసాధారణం: గంభీర్‌ ప్రశంసలు | Absolutely: Gambhir Hails Jadeja Heroics At Lord's Blunt Message To Haters | Sakshi
Sakshi News home page

లార్డ్స్‌లో అతడి పోరాటం అసాధారణం: గంభీర్‌ ప్రశంసలు

Jul 18 2025 12:36 PM | Updated on Jul 18 2025 12:56 PM

Absolutely: Gambhir Hails Jadeja Heroics At Lord's Blunt Message To Haters

లార్డ్స్‌ టెస్టులో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అసాధారణ పోరాటం చేశాడని టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. విజయం కోసం చివరి వరకు పట్టుదలగా నిలబడిన జడ్డూ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడని కొనియాడాడు. కాగా ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడుతోంది.

ఇందులో భాగంగా తొలుత లీడ్స్‌లో ఇంగ్లండ్‌ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ క్రమంలో సిరీస్‌ 1-1తో సమంగా ఉన్న వేళ లార్డ్స్‌ (Lord's Test)లో జరిగిన మూడో టెస్టు ఆఖరి రోజు వరకు ఉత్కంఠగా సాగింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

జడ్డూ పోరాటం వృథా
అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన తరుణంలో టీమిండియా సులువుగానే ఓటమిని అంగీకరిస్తుందని అంతా భావించారు. కానీ జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్‌) అద్భుత పోరాటపటిమతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే, టెయిలెండర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (30 బంతుల్లో 4) అనూహ్య రీతిలో బౌల్డ్‌ కావడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. జడ్డూ పోరాటం వృథాగా పోయింది.

ఈ నేపథ్యంలో అనిల్‌ కుంబ్లే, సునిల్‌ గావస్కర్‌ వంటి భారత క్రికెట్‌ దిగ్గజాలు జడ్డూ ఇంకాస్త దూకుడుగా ఆడి ఉంటే బాగుండేదని విమర్శించారు. అయితే, కోచ్‌ గంభీర్‌ మాత్రం జడేజా సరైన రీతిలోనే ఆడాడంటూ విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చాడు. ‘‘అదొక అసాధారణ పోరాటం. 

జడ్డూ పోరాడిన తీరు నిజంగా ఒక అద్భుతం లాంటిదే’’ అని గంభీర్‌ జడ్డూను కొనియాడాడు. డ్రెసింగ్‌రూమ్‌లో ఈ మేరకు అతడు వ్యాఖ్యలు చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 

మా జట్టులో ఉండటం అదృష్టం
ఇక సిరాజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఫీల్డింగ్‌, బౌలింగ్‌, బ్యాటింగ్‌... ఇలా మూడు విభాగాల్లోనూ జడ్డూ భాయ్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టు కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు.

జట్టుకు అవసరమైన ప్రతిసారీ నేనున్నానంటూ బ్యాట్‌తో ఆదుకుంటాడు. క్షిష్ట సమయాల్లో రాణించే ఇలాంటి ప్లేయర్‌ అన్ని జట్లలోనూ ఉండడు. అతడు మా జట్టులో ఉండటం నిజంగా మా అదృష్టం’’ అంటూ ప్రశంసించాడు. కాగా టీమిండియాతో సిరీస్‌లో 2-1తో ఇంగ్లండ్‌ ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)కు మాంచెస్టర్‌ వేదిక.

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ మూడో టెస్టు సంక్షిప్త స్కోర్లు
👉ఇంగ్లండ్‌: 387 & 192
👉భారత్‌: 387 & 170
👉ఫలితం: 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపు.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement