భారీ మైలురాయిని అధిగమించిన శ్రేయస్‌ అయ్యర్‌ | 7000 RUNS FOR SHREYAS IYER IN T20s | Sakshi
Sakshi News home page

భారీ మైలురాయిని అధిగమించిన శ్రేయస్‌ అయ్యర్‌

May 24 2026 12:12 PM | Updated on May 24 2026 12:35 PM

7000 RUNS FOR SHREYAS IYER IN T20s

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో నిన్న (మే 23) జరిగిన డు ఆర్‌ డై మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఓ భారీ మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీతో తన జట్టును గెలిపించిన అతడు.. టీ20ల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

తద్వారా కేఎల్‌ రాహుల్‌ (197 ఇన్నింగ్స్‌), విరాట్‌ కోహ్లి (212), శిఖర్‌ ధవన్‌ (246) తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్‌గా (247) రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్‌ 7000 రన్స్‌ రికార్డు పాక్‌ ఆటగాడు బాబర్‌ ఆజం (187) పేరిట ఉంది. బాబర్‌ తర్వాతి స్థానాల్లో క్రిస్‌ గేల్‌ (192), కేఎల్‌ రాహుల్‌ ఉన్నారు.

నిన్నటి మ్యాచ్‌ విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్‌ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నోపై పంజాబ్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 197 పరుగుల ఛేదనలో శ్రేయస్‌ సిక్సర్‌తో సెంచరీ (51 బంతుల్లో 101 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసుకోవడంతో పాటు జట్టును కూడా విజయతీరాలకు చేర్చాడు. అతడికి ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (69) సహకరించాడు.

ఈ గెలుపుతో పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ ఇదివరకే బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. చివరి బెర్త్‌ కోసం పంజాబ్‌తో పాటు రాజస్థాన్‌, కేకేఆర్‌ పోటీపడుతున్నాయి.

ఇవాళ మధ్యాహ్నం ముంబై, రాజస్థాన్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ గెలిస్తే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఈ జట్టే దక్కించుకుంటుంది. పంజాబ్‌, కేకేఆర్‌ రేసు నుంచి నిష్క్రమిస్తాయి.

ఒకవేళ ముంబై చేతిలో రాజస్థాన్‌ ఓడిందా.. రాత్రి కేకేఆర్‌-ఢిల్లీ మ్యాచ్‌ వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ముంబై చేతిలో ఓడితే రాజస్థాన్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు పోటీలో పంజాబ్‌, కేకేఆర్‌ ఉంటాయి.

ఢిల్లీపై కేకేఆర్‌ గెలిస్తే నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది. పంజాబ్‌, కేకేఆర్‌ జట్లలో ఏ జట్టుకు మెరుగైన రన్‌రేట్‌ ఉంటే, ఆ జట్టే ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో పోటీకి సిద్దమవుతుంది.

ఒకవేళ ఢిల్లీ చేతిలో కేకేఆర్‌ ఓడిందా పంజాబ్‌ దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మధ్యాహ్నం మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓడాలి. రాత్రి మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓడాలి. రాత్రి మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలిచినా భారీ తేడాతో గెలవకపోయినా పంజాబ్‌కే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కుతుంది.

ఒకవేళ కేకేఆర్‌కు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కాలంటే ముంబై చేతిలో రాజస్థాన్‌ ఓడాలి. ఢిల్లీపై ఆ జట్టు భారీ తేడాతో గెలవాలి.

రాజస్థాన్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ముంబైపై తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రాత్రి మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement