ఫిఫా ప్రపంచకప్‌ నుంచి నాడు భారత్‌ తప్పుకొందని తెలుసా? | The 1950 Reality Check: How India Qualified For FIFA World Cup But Not Play | Sakshi
Sakshi News home page

ఫిఫా ప్రపంచకప్‌ నుంచి నాడు భారత్‌ తప్పుకొందని తెలుసా?

Jun 27 2026 5:56 PM | Updated on Jun 27 2026 6:15 PM

The 1950 Reality Check: How India Qualified For FIFA World Cup But Not Play

ప్రపంచకప్ ఫుట్‌బాల్ సీజన్ వచ్చినప్పుడల్లా భారత ఫుట్‌బాల్ అభిమానుల హృదయాల్లో ఒక ప్రశ్న కచ్చితంగా మెదులుతుంది. అసలు ప్రపంచకప్ వేదికపై భారత్ ఎప్పుడు అడుగుపెడుతుంది? అనే ప్రశ్న అభిమానులను తొలిచివేస్తుంది. కానీ, 76 ఏళ్ల క్రితమే, భారత జట్టు ప్రపంచకప్ ఆడటానికి అర్హత సాధించినా.. చేజేతులా ఆ అవకాశాన్ని వదిలేసుకుందన్న చేదు నిజం ఎంతమందికి తెలుసు?

1950 బ్రెజిల్ ప్రపంచకప్‌లో భారత్ ఆడకపోవడానికి 'బూట్లు లేకపోవడమే' కారణమనే ప్రచారం ఇప్పటికీ ఉన్న విషయం మీకు తెలుసా?? అది నిజమేనా? లేక దాని వెనుక అంతకంటే పెద్ద కథేమైనా ఉందా? భారత క్రీడా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.

భారత్‌ నాడు సువర్ణావకాశం
అది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతి కాలం. 1950 జూన్ 24 నుంచి జూలై 23 వరకు బ్రెజిల్‌లో నాలుగో ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఆ సమయంలో ఆసియా గ్రూప్‌లో ఉన్న బర్మా.. అదే ఇప్పుడు మయన్మార్, ఫిలిప్పీన్స్ జట్లు టోర్నీ నుంచి తప్పుకోవడంతో.. భారత్‌కు నేరుగా ప్రపంచకప్ ఆడే సువర్ణావకాశం లభించింది. ఏకంగా స్వీడన్, ఇటలీ, పరాగ్వేలతో కలిసి గ్రూప్-3లో భారత్ స్థానం సంపాదించింది.

బ్రెజిల్ ఆఫర్
ఒకవేళ భారత్ బరిలోకి దిగి ఉంటే, జూన్ 28న పరాగ్వేతో తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉండేది. ఆతిథ్య దేశమైన బ్రెజిల్ సైతం ‘గాంధీ దేశం’ నుంచి వస్తున్న భారత జట్టు కోసం ఎంతో ఆశగా ఎదురుచూసింది. 

అవసరమైతే భారత ఆటగాళ్ల ప్రయాణ ఖర్చులు తామే భరిస్తామని కూడా బ్రెజిల్ ఆఫర్ చేసింది. కానీ, చివరి నిమిషంలో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ తీసుకున్న ఒక నిర్ణయం.. భారత ఫుట్‌బాల్ భవిష్యత్తును మార్చేసింది.

1948 లండన్ ఒలింపిక్స్‌లో బూట్లు లేకుండా ఆడిన భారత జట్టు, బలమైన ఫ్రాన్స్‌కు ముచ్చెమటలు పట్టించింది. కేవలం 1-2 తో ఓడిపోయినా, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆ జట్టులో శైలన్ మన్నా, అహ్మద్ ఖాన్, ఎస్. మేవలాల్, థామస్ మత్తాయి వర్గీస్ వంటి హేమాహేమీలు ఉన్నారు. సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు.

అసలు కారణాలు వేరే
అయితే.. భారత ఆటగాళ్లకు బూట్లు లేవనే కారణంతోనే ప్రపంచకప్ ఆడలేదనేది పూర్తి నిజం కాదని.. అప్పటికే హైదరాబాద్, మైసూర్ ఆటగాళ్లు బూట్లతో ఆడటం అలవాటు చేసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు 1953 నుంచే ఫిఫా బూట్లతో ఆడాలన్న నిబంధనను కఠినతరం చేసింది. కాబట్టి టోర్నీ నుంచి భారత్ తప్పుకోవడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

ఒలింపిక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత
అవును, నాటి భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్ అప్పట్లో ప్రపంచకప్‌ కంటే ఒలింపిక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ప్రపంచకప్‌లో ఆడితే ఆటగాళ్లు ప్రొఫెషనల్స్‌గా మారిపోతారని, దానివల్ల ఒలింపిక్స్‌లో ఆడే అర్హత కోల్పోతామని భయపడ్డారు. దానికి తోడు, సుదీర్ఘమైన ఓడ ప్రయాణం, ఆర్థిక భారం, జట్టు ఎంపికలో విభేదాలు భారత్‌ను వెనక్కి లాగాయి.

వీటన్నింటికీ మించి, అప్పట్లో భారత్‌లో కేవలం 70 నిమిషాల మ్యాచ్‌లు మాత్రమే ఆడేవారు. అంతర్జాతీయంగా 90 నిమిషాల పాటు ఆడే సత్తా, ఫిట్‌నెస్ తమకు ఉందా? లేదా? అనే అనుమానాలు కూడా ఫెడరేషన్‌ను పీడించాయి. దీంతో 1951లో ఢిల్లీలో జరగబోయే ఆసియా క్రీడలపై దృష్టి పెట్టాలనే నెపంతో ప్రపంచకప్ నుంచి భారత్ తప్పుకొంది.

 ఇప్పటికీ మూల్యం చెల్లిస్తూనే ఉంది
చివరి నిమిషంలో భారత్ తప్పుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఫిఫా, ఆ తర్వాత 1954 ప్రపంచకప్ ఆడేందుకు భారత్ దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించింది. 

ఆ తర్వాత భారత్ 1951, 1962 ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాలు సాధించి.. ఫుట్‌బాల్‌లో సువర్ణ యుగాన్ని చూసినప్పటికీ.. ప్రపంచకప్ వేదికపై ఆడే అవకాశాన్ని మాత్రం ఇప్పటివరకు దక్కించుకోలేకపోయింది. నాటి ఫెడరేషన్ చేసిన ఆ ఒక్క చారిత్రక తప్పిదానికి.. భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తూనే ఉంది.

నాటి నిర్ణయం సరైనదా? కాదా? అనేది పక్కన పెడితే.. ఆ రోజు గనుక భారత్ బ్రెజిల్ విమానం ఎక్కి ఉంటే, ఈరోజు ప్రపంచ ఫుట్‌బాల్ పటంలో భారత స్థానం వేరేలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా, ఆనాటి తప్పులను అధిగమించి, త్వరలోనే మన దేశం మెగా టోర్నీలో అడుగుపెట్టాలని ఆశిద్దాం.

చదవండి: ‘నేను 13 సిక్సర్లు బాదుతాను.. మిగతాది మీరు చూసుకోండి’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement