దివ్యాంగులకు కో–ఆప్షన్‌ పదవులు | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు కో–ఆప్షన్‌ పదవులు

Aug 5 2026 8:45 AM | Updated on Aug 5 2026 8:45 AM

● త్వరలో రిజర్వేషన్‌ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ● జిల్లాలో సుమారు 20 వేల మంది దివ్యాంగులు

● త్వరలో రిజర్వేషన్‌ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ● జిల్లాలో సుమారు 20 వేల మంది దివ్యాంగులు

నారాయణఖేడ్‌: ఉద్యోగావకాశాల్లో కల్పించినట్లుగానే తమకు రాజకీయంగా కూడా రిజర్వేషన్లు కల్పించాలన్న దివ్యాంగుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం త్వరలో కో–ఆప్షన్‌ పదవుల్లో రిజర్వేషన్‌ కల్పించేందుకు చర్యలు చేపట్టింది. మహిళలు, ఇతర సామాజిక వర్గాలకు రాజకీయంగా రిజర్వేషన్‌ ఉన్నా దివ్యాంగులకు మాత్రం రాజకీయంగా రిజర్వేషన్‌ లేదని దివ్యాంగులు కొన్నాళ్లుగా ఆందోళనలు చేపడుతూ ప్రభుత్వాలకు విజ్ఞాపనలు ఇస్తున్నారు. ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన తరహాలోనే రాజకీయంగా 5 నుంచి 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పించినట్లవుతుందని కోరుతున్నారు. కాగా ఇటీవల ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కూడా రాష్ట్రం నుంచి దివ్యాంగులు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఇటీవల రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రికి సైతం రిజర్వేషన్‌ కోసం విజ్ఞప్తి చేశారు. దీంతో రాజకీయంగా కొంత ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

స్థానిక సంస్థల్లో కో–ఆప్షన్‌ సభ్యులుగా వారికి రిజర్వేషన్లు కల్పించి అవకాశం కల్పించనున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ దివ్యాంగులను కో–ఆప్షన్‌ సభ్యులుగా నియమించేందుకు ఇటీవల ఉన్నతస్థాయి సమావేశం సైతం నిర్వహించారు. ఇప్పటికే ట్రాన్స్‌ జెండర్లకు స్థానిక సంస్థల్లో కో–ఆప్షన్‌ సభ్యులుగా అవకాశాలు కల్పించిన ప్రభుత్వం అదే తరహాలో దివ్యాంగులకు కూడా అవకాశం కల్పించాలని యోచిస్తోంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో అవకాశాలు కల్పించనున్నారు. జిల్లాలో దివ్యాంగ పింఛన్‌ పొందుతున్న వారు 13,985మంది ఉండగా సుమారు 20 వేల వరకు దివ్యాంగులు ఉన్నట్లు సంఘం నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో కోఆప్షన్‌ సభ్యుల ఎంపికలు పూర్తయ్యాయి. కాగా గ్రామ పంచాయతీ స్థాయిల్లో కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రభుత్వం సవరణలు చేపట్టి మున్సిపాలిటీల్లోనూ అవకాశాలు కల్పిస్తే అక్కడ ప్రాతినిత్యం దక్కనుంది.

ఇవీ బాధ్యతలు..

అవకాశం కల్పించాలి

ఇతరులకు రిజర్వేషన్లు కల్పించిన తరహాలోనే తమకు రాజకీయంగా అవకాశం కల్పించాలని చాలా ఏళ్లుగా పోరాడుతున్నాం. ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని కో–ఆప్షన్‌గా అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. రాజకీయంగా తమకు 10 శాతం వరకు అవకాశం కల్పించాలి. తమ వాణిని బలంగా వినిపించి తమ వర్గాలకు మేలు చేకూర్చగలం.

– ఎం. బస్వరాజ్‌, ఎన్‌పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు

కో–ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికైన వారికి మున్సిపాలిటీలు, గ్రామ సభల్లో, పంచాయతీ సమావేశాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. వార్డు సభ్యులు, కౌన్సిలర్లతో సమానంగా ప్రొటోకాల్‌ ఉంటుంది. గ్రామ, పట్టణ అభివృద్ధికి వీరిచ్చే సలహాలు, సూచనలకు ప్రాధాన్యం ఉంటుంది. గౌరవ వేతనం, ఇతర ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి అందుతాయి. సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనవచ్చు. కానీ ఏదైనా ఎన్నిక జరిగితే ఓటువేసే అధికారం ఉండదు. కేవలం పంచాయతీ, మున్సిపాలిటీకి సలహాదారుగా మాత్రమే వ్యవహరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement