రాష్ట్ర అధికార ప్రతినిధి మహేందర్‌రెడ్డి
నంగునూరు(సిద్దిపేట): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని పీఆర్‌టీయూ టీఎస్ అధికార ప్రతినిధి మహేందర్‌రెడ్డి అన్నారు. నంగునూరులో పీఆర్‌టీయూ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ పాఠశాల అవార్డు సాధించేలా కృషి చేసిన నంగునూరు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రామస్వామిని సత్కరించారు. అనంతరం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపే తానికి కృషి చేస్తూనే ఉపాధ్యాయుల డిమాండ్ల సాధనకు పోరాటం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్షుడు పార్థసారధి, రాష్ట్ర అసోసియేట్ సభ్యుడు రాజిరెడ్డి, భూపతిరెడ్డి, నరేశ్, రవి, జయపాల్‌యాదవ్, రామరాజు, రాములు పాల్గొన్నారు.
వర్షాలకు కూలిన ఇల్లు
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలో భారీ వర్షాలకు మంగళవారం ఎదుగని శ్రీనివాస్, రుక్మిణి దంపతుల ఇల్లు కూలిపోయింది. ఘటనా సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమా దం తప్పింది. ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో కుటుంబానికి నివాసం లేకుండా అయింది. ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
మందుబాబులకు జరిమానా
పటాన్‌చెరు టౌన్: డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా విధించింది. ఈ సంఘటన పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 9 మందిని పట్టుకున్నారు. పట్టుబడిన వాహనదారులను మంగళవారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 9 మందికి రూ. 11 వేల జరిమానా విధించారు.
లారీ డ్రైవర్లకు జైలు శిక్ష
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి సిద్దిపేట కోర్టు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు వివరాల ప్రకారం.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఇద్దరు లారీ డ్రైవర్లు పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపర్చగా మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానాతో పాటు ఐదు రోజుల జైలు శిక్ష విధించారు.
ప్రైవేట్ టీచర్ అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వినోద్ వివరాల ప్రకారం.. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్‌నగర్‌కు చెందిన దీప్తి(22) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో జులై 30న స్కూల్‌కి వెళ్లింది. కాగా మధ్యాహ్నం కడుపునొప్పి వస్తుందని చెప్పి ఇంటికి వెళ్తానని స్కూల్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆమె కోసం కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి శ్రీనివాస్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రమాదవశాత్తు
నీటమునిగి రైతు మృతి
శివ్వంపేట(నర్సాపూర్): ప్రమాదవశాత్తు నీటమునిగి రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గూనంగారి స్వామి(40) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగు పనుల అనంతరం పొలం పక్కనే ఉన్న నేరెళ్లకుంటలో కాళ్లు, చేతులు కడుగుతుండగా ప్రమాదవశాత్తు జారి కుంటలో పడి మునిగిపోయాడు. సమీప పొలాల రైతులు గమనించి కుంటలో నుంచి బయటకు తీసి నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతిచెందాడు.


