కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Aug 5 2026 8:45 AM | Updated on Aug 5 2026 8:45 AM

చేగుంట(తూప్రాన్‌): కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఇబ్రహీంపూర్‌ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్ము మోహన్‌(37) కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో భార్య వసంతతో గొడవపడి క్షణికావేశంలో ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరివేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా గ్రామానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. మృతుడి భార్య వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

చెరువులో దూకి రైతు..

చేర్యాల(సిద్దిపేట): అప్పులు తీర్చలేక చెరువులో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాలు.. మంగళవారం ఉదయం పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యువకుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా మండలంలోని కొత్త దొమ్మాట గ్రామానికి చెందిన శెట్టె రామస్వామి(38)గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కాగా ఆవుల షెడ్డు నిర్మాణం, బోర్లు వేయడంతో రామస్వామి అప్పులు చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పులు తిరిగి చెల్లింపు విషయమై ఇంట్లో జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన ఆయన సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లాడు. మంగళవారం ఉదయం స్థానిక పెద్ద చెరువులో శవమై కనిపించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో..

సిద్దిపేటరూరల్‌: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని రాంపూర్‌ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన చత్రి తిరుపతి(45) ఇంటి నిర్మాణం కోసం 2025లో హౌసింగ్‌ లోన్‌ రూ. 9,92,632 తీసుకున్నాడు. దీనికి గాను నెలకు వాయిదా పద్ధతిలో రూ.17,976 చెల్లించాల్సి ఉంది. దీంతో కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తిరుపతి లోన్‌ వాయిదా చెల్లించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం మధ్యాహ్నం డబ్బుల విషయమై బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన తిరుపతి సాయంత్రమైనా రాలేదు. కాగా మంగళవారం ఉదయం ఇంటి వెనక ఉన్న చింతచెట్టుకు తిరుపతి ఉరివేసుకొని కనిపించాడు. కుటుంబీకులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement