అప్పులబాధతో వ్యక్తి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో వ్యక్తి బలవన్మరణం

Jul 29 2026 9:51 AM | Updated on Jul 29 2026 9:51 AM

సిద్దిపేటరూరల్‌: అప్పులు ఎక్కువ కావడంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన మండల పరిధిలోని చింతమడక గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన పెద్దిగాని ప్రవీణ్‌ (26) తనకు ఉన్న వరి కోతమిషన్‌తో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మిషన్‌ రిపేరు కావడంతో ఇంటి వద్దే ఉంచి, భార్యతో కలిసి కూలి పనులకు వెళ్తున్నాడు. నిర్మాణంలో ఉన్న ఇల్లు సైతం పూర్తి కాకపోవడంతో అప్పులు కాగా పలువురితో చెప్పుకుంటూ మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో ఆదివారం భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లగా, సోమవారం రాత్రి చున్నీతో ఉరివేసుకున్నాడు. ఈ సమయంలో అన్న కనకరాజు ప్రవీణ్‌కు భోజనం ఇచ్చేందుకు వెళ్లి తలుపు తెరిచి చూడగా ఫ్యానుకు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

పురుగుల మందు తాగి ..

దుబ్బాకటౌన్‌: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాయపోల్‌ మండలం లింగారెడ్డిపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కూసంబి సంతోష్‌(42) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇటీవల మద్యానికి బానిసగా మారి గ్రామంలో అప్పులు చేశాడు. ఇదే విషయంపై భార్య అనిత సోమవారం మందలించగా ఇద్దరు గొడవపడ్డారు. అదే కోపంతో మధ్యాహ్నం ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లి పురుగులమందు తాగాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement