వేతన వెతలు | - | Sakshi
Sakshi News home page

వేతన వెతలు

Jul 30 2026 7:30 AM | Updated on Jul 30 2026 7:30 AM

హత్నూర(సంగారెడ్డి): వచ్చేది చాలీచాలని వేతనం...ఏకంగా ఏడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో మిషన్‌ భగీరథ నీటి పథకంలో పనిచేసే పంపు లైన్‌మెన్లు ఇబ్బందులు పడుతున్నారు. హత్నూర మండలం బోరుపట్ల గ్రామ శివారులోని మిషన్‌ భగీరథ పంప్‌ హౌస్‌ నుంచి హత్నూర, గుమ్మడిదల, జిన్నారం, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌, కౌడిపల్లి,చిలపిచేడ్‌, శివంపేట్‌, కొల్చారం, మాసాయిపేట మండలాలలోని సుమారు 480 గ్రామాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా మంజీర నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ మండలాలలో లైన్‌మెన్లుగా 156 మంది కొన్నేళ్లుగా పనిచేస్తూ గ్రామాలకు వెళ్లే పైప్‌లైన్‌లను ఆన్‌ ఆఫ్‌ చేస్తూ నీటిని గ్రామాల్లోని రక్షిత మంచినీటి ట్యాంకులకు వదులుతున్నారు. ప్రతీనెల ప్రభుత్వం భూ రత్న ఏజెన్సీ ద్వారా వీరికి రూ.8,350 వేతనాన్ని అందిస్తూ వచ్చింది. అయితే ఏడు నెలలుగా వేతనాలు సక్రమంగా రాక కుటుంబ పోషణకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాల కోసం బోరుపట్ల పంప్‌ హౌస్‌ దగ్గర మిషన్‌ భగీరథ సిబ్బంది ధర్నా చేసి ఉన్నతాధికారులకు విన్నవించారు. అయినా మా గోడు ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అదనపు కలెక్టర్‌ ఆరాతో..

ఇటీవల హత్నూర మండలం బోరపట్ల పంప్‌ హౌస్‌కు జిల్లా అదనపు కలెక్టర్‌ పాండు మిషన్‌ భగీరథలో పనిచేసే కార్మికులతో వేతనాలు వస్తున్నాయా? అని ఆరా తీసినప్పుడు ఏడు నెలలుగా వేతనాలు రాలేదని వాపోయారు. ఆగస్టు వస్తే ఎనిమిది నెలలు అవుతుందని వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు ఇప్పించాలని పంపు లైన్మెన్లు విజ్ఞప్తి చేశారు.

కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం

త్వరగా విడుదల చేయాలని కోరుతున్న 156 మంది పంపు లైన్‌మెన్లు

ఏడు నెలలుగా వేతనాలు అందుకోని మిషన్‌ భగీరథ లైన్‌మెన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement