ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియతో జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ తీరును పరిశీలిస్తే ఏకంగా సుమారు 2.5 లక్షల ఓట్లు తొలగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని అనధికారిక అంచనా. అత్యధికంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో సుమారు 1.20 లక్షల ఓట్లు తొలగిపోతాయని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇంకా ఆరు రోజులే గడువుండటంతో గ్రామాల్లో సర్ ప్రక్రియ వేగంగా సాగుతుండగా పట్టణాల్లో మాత్రం మందగించింది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి :
పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు చాలామంది ఓటర్ల ఎపిక్ నంబర్‌లో ఏపీలో మ్యాపింగ్ అయి ఉంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ఓటర్లు ఆయా రాష్ట్రాల్లోని తమ సొంతూరులోనే ఓటును ఉంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పటాన్‌చెరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనాకు వస్తున్నారు. అలాగే సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోనూ సుమారు 40 వేల వరకు చొప్పున ఓట్లు తగ్గుతాయని అనుకుంటున్నారు.
76 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ
సర్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌ఓలు ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్‌లో డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పుటి 76 శాతమే పూర్తయింది. జిల్లావ్యాప్తంగా 14.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, 11.09 లక్షల ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. ఇంకా 3.48 లక్షల మంది ఓటర్లకు సంబంధించి ఫారాలు చేయాల్సి ఉంది. అయితే ఆగస్టు 3 లోపు బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి డిజిటలైజేషన్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆగస్టు 10 తేదీ నాడు ఓటరు జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయాలని ఆదేశించింది. దీంతో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌కు కేవలం ఆరు రోజులే గడువుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
పట్టణాల్లో నత్తనడకన
డిజిటలైజేషన్ ప్రక్రియ పట్టణ, నగర ప్రాంతంలో తక్కువగా జరిగింది. గ్రామీణ ప్రాంతంలో కాస్త మెరుగ్గా ఉంది. గ్రామాల్లో నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు, అలాగే మరణించిన ఓటర్ల వివరాలు సులభంగా తెలుస్తున్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దీంతో పట్టణ ప్రాంతాలతో పోల్చితే.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియ కాస్త మెరుగ్గా సాగుతోంది. మరోవైపు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని వందశాతం పూర్తి చేశామని అధికారులు పేర్కొంటున్నారు. కానీ పట్టణ, నగర ప్రాంతాల్లో చాలామందికి ఈ ఫారాలు అందలేదు. దీంతో చాలామంది ఓటర్లు ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ చేసుకున్నారు.
అత్యధికంగా పటాన్‌చెరులో 1.20లక్షలకు పైగా..!
సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోనూ..
ఇంకా డిజిటలైజ్ చేయాల్సిన ఎన్యూమరేషన్ ఫారాలు 3.48 లక్షలు
ఎస్‌ఐఆర్‌కు ఆరు రోజులే గడువు
నియోజకవర్గాల వారీగా డిజిటలైజేషన్ తీరు ఇలా నియోజకవర్గం మొత్తం ఓటర్లు ఈ.ఎఫ్.డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ శాతం నారాయణఖేడ్ 2,36,579 2,07,009 87.5 అందోల్– జోగిపేట 2,55,084 2,18,404 85.62 జహీరాబాద్ 2,82,398 2,25,136 79.72 సంగారెడ్డి 2,54,693 1,94,984 76.56 పటాన్‌చెరు 4,28,682 2,63,647 61.5 మొత్తం 14,57,436 11,09,180 76.1


