పుట్టగొడుగు.. పోషకాలు మెండు
కౌడిపల్లిః విజ్ఞానజ్యోతిలో
పెంచుతున్న పుట్టగొడుగులు
‘విజ్ఞానజ్యోతి’లో జోరుగా పెంపకం
● వ్యవసాయంతోపాటు ప్రత్యేక శిక్షణ
● ప్రారంభం నుంచి మార్కెటింగ్ వరకు మెలకువలు
కౌడిపల్లి(నర్సాపూర్): వ్యవసాయ విద్యార్థులకు పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది. ఇప్పటికే వ్యవసాయంతోపాటు కూరగాల పెంపకం, పాడిపరిశ్రమపై శిక్షణ ఇస్తున్నారు. మండలంలోని తునికి వద్దగల డాక్టర్ డి.రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యాసంస్థ, వ్యవసాయ పాల్‌టెక్నిక్ కళాశాలలో వరితోపాటు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతోటలు, ఆహారపంటల సాగుపై సస్యరక్షణ చర్యలపై క్షేత్రస్థాయిలో విద్యార్థులకు శిక్షణ కొనసాగుతోంది. దీనికి తోడుగా పుట్టగొడుగులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు విజ్ఞానజ్యోతి డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, ఉపాధ్యాయుడు మహేశ్ తెలిపారు.
విజ్ఞానజ్యోతిలో పుట్టగొడుగుల పెంపకం కోసం కళాశాల సమీపంలో ప్రత్యేకంగా ఒక చీకటి గదిని ఏర్పాటు చేశారు. అందులో పుట్టగొడుగులలో ప్రత్యేకమైన ముత్యపుచిప్ప, పాలపుట్టగొడుగులను పెంచుతున్నారు. వాటి పెంపకం కోసం వరిగడ్డిని ముక్కలుగా కట్‌చేసి 7–8 గంటలపాటు నీటిలో నానబెడతారు. అనంతరం వేడినీటితో శుద్ధిచేసి నీడలో తేమ ఉండేలా ఆరబెట్టి గోనె సంచులు పాలిథిన్ కవర్లలోవేసి మట్టితో నింపుతారు. అనంతరం వాటి మధ్యలో విత్తనాలు వేసి చీకటిగదిలో పెడతారు. 15–20 రోజుల్లో పుట్టగొడుగులు వస్తాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడంవల్ల నాన్యమైన పుట్టగొడుగులను పండించవచ్చని అధ్యాపకులు చెపుతున్నారు. పండించిన పుట్టగొడుగులును శుభ్రంచేసి రంధ్రాలు చేసిన పాలిథిన్ కవర్లలో ప్యాకింగ్‌చేయాల్సి ఉంటుంది. చల్లటి ప్రదేశం(ఫ్రిజ్)లో నిల్వ చేయడంవల్ల 7–8 రోజులు ఉంచవచ్చు.
తక్కువ శ్రమ.. అధిక ఆదాయం
పుట్టగొడుగుల్లో అనేక పోషకాలు ఉండటంతో వంటలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో వాటికి ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. మంచి మెలకులతో జాగ్రత్తలు పాటించి పెంచడంవల్ల మంచి ఆదాయం వస్తుందని, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో అధిక ఆదాయం పొందవచ్చని చెప్పారు.
పుట్టగొడుగు.. పోషకాలు మెండు
పుట్టగొడుగు.. పోషకాలు మెండు


