ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి: మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణంలోని రాజంపేట్ శివాలయంలో బ్రాహ్మణ సహకార సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతా ప్రభాకర్ హాజరై మహిళలనుద్దేశించి ప్రసంగించారు. మహిళలు కుటుంబాన్ని తీర్చిదిద్దడంతోపాటు సమాజాభివృద్ధిలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. మహిళలు విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, కంది మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్ జలంధర్ రావు, బ్రాహ్మణ సహకార సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


