
జహీరాబాద్ ఇన్‌చార్జిఆర్డీఓగా డెవూజా
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ఇన్‌చార్జి ఆర్డీఓగా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి డెవూజా శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఆర్డీఓగా ఉన్న రాంరెడ్డి ధీర్ఘకాలం సెలవుపై వెళ్లగా..ఆయన స్థానంలో డెవూజాను నియమించారు. బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన వరద ప్రాంతాల్లో పర్యటించారు. నారింజ ప్రాజెక్టును సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
సింగూరుకు భారీ వరద
ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. రెండు రోజులుగా కురిసిన వర్షపునీరు డ్యామ్‌లోకి చేరుతోంది. దీంతో 5,6,9,8,10,11 నంబర్ గల ఆరు గేట్లను రెండు మీటర్ల పైకి ఎత్తి దిగువకు 60,920 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాగా, ప్రాజెక్టులో 19 టీఎంసీల నీటిని ఉంచి మిగతా నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 53,075 ఇన్‌ఫ్లో రాగా..ఔట్‌ఫ్లో 60,920 క్యూసెక్కులని అధికారులు తెలిపారు.