
వర్షానికి తెగిపోయిన రోడ్లు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
దుబ్బాకరూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ తెగిపోయాయి. కామారెడ్డి జిల్లాకు వెళ్లాలంటే బీబీపేట వద్ద రోడ్డు కోతకు గురైంది. అలాగే నర్మాల నుంచి వెళ్లాలంటే మానేరు వాగు పొంగి పొర్లడంతో రోడ్డుపై నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా పోతోంది. మెదక్ జిల్లాకు వెళ్లాలంటే నిజాంపేట వద్ద రోడ్డు తెగింది. కామారెడ్డి జిల్లాను సరిహద్దును కలిపే మండలంలోని ఆకారం వాగు బ్రిడ్జిపై నుంచి నీళ్లు ఎక్కువగా పోవడంతో రాక పోకలు నిలిచి పోయాయి. ఇలా ఎటూ చూసినా వీలు లేకుండా పోయింది. ఎక్కడి వారు అక్కడే తమ బంధువుల ఇండ్లల్లోనే ఉండి పోయారు. ఒక వేళ కామారెడ్డికి వెళ్లాలంటే కరీంనగర్ మీదుగా 160 కిలో మీటర్ల దూరం అవుతుంది. ఇంతకు ముందుకు 35 కిలో మీటర్లు ఉండేది. మూడు రోజులుగా ఊర్లకు వెళ్లేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు.