సింగూరుకు పోటెత్తిన వరద
● ఏడు గేట్లు ఎత్తి నీరు విడుదల ● ఇన్‌ఫ్లో 71,025 క్యూసెక్కులు.... ఔట్ ఫ్లో 74,722 క్యూసెక్కులు
పుల్‌కల్(అందోల్): రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. మునిపల్లి మండలం దుబ్బవాగు,రాయికోడ్,రేగోడ్ మండలాలలో కురిసిన నీరంతా డ్యామ్‌లోకి చేరుకుంటోంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 71,025 క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో అధికారులు ఏడు గేట్‌లను ఎత్తి దిగువకు 74,722 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నాలుగు గేట్‌లు రెండు మీటర్లు, మూడు గేట్‌లు రెండున్నర మీటర్లు ఎత్తారు. జెన్‌కోకు 1,732 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు అదికారులు నిరంతరం అప్రమత్తంగ ఉంటున్నారు.ఏడు గేట్‌లు ఎత్తడంతో పర్యాటకులు ప్రాజెక్టు వద్ద సందడి చేస్తున్నారు.


