
జహీరాబాద్ చెక్‌పోస్టు ఎత్తివేత!
జహీరాబాద్: రాష్ట్ర సరిహద్దులోని 65వ జాతీయ రహదారిపై జహీరాబాద్ వద్ద ఉన్న రవాణ శాఖ చెక్‌పోస్టును త్వరలో ఎత్తివేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెక్‌పోస్టులను ఎత్తివేయనున్నందున అందులోభాగంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం మాడ్గి వద్ద చెక్‌పోస్టు త్వరలో మూతపడనుంది. చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జహీరాబాద్ చెక్‌పోస్టు సైతం ఎత్తివేయనున్నారు. దీంతో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జహీరాబాద్, కామారెడ్డి, మద్నూర్ రవాణా శాఖ చెక్‌పోస్టులను ఎత్తివేయనున్నారు. రవాణ సరుకు వాహనాలకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సులభంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆర్టీఏ సరిహద్దు చెక్‌పోస్టులను ఎత్తివేశారు. ఇంతకు ముందు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెక్‌పోస్టుల ఎత్తివేతకు సానుకూలంగా లేనందునే ఎత్తివేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో చెక్‌పోస్టుల ఎత్తివేతకు మార్గం సుగమం అయింది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రవాణ పర్మిట్లు, ఇతర అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే లభిస్తున్నాయి. దీంతో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రవాణ శాఖ చెక్‌పోస్టులు అవసరం లేదని కేంద్రం 2021లో ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సరిహద్దు చెక్‌పోస్టులను ఇప్పటికే తీసివేశారు. మిగతా రాష్ట్రాల్లో చెక్‌పోస్టుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కూడ చెక్‌పోస్టులను తొలగించేందుకు నిర్ణయించారు.
ఆయా శాఖల్లో తీరనున్న సిబ్బంది కొరత
చెక్‌పోస్టులను తొలగించడం వల్ల లారీ యజమానులు, ఇతర వాహనాల యజమానులకు ఊరట లభించనుంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలు, వాటి పర్మిట్లు చెక్‌పోస్టుల్లో తనిఖీ చేయించుకోవాలి. పర్మిట్లతోపాటు అన్నీ అనుమతులు ఉన్నప్పటికీ వాహనం చెక్‌పోస్టు దాటాలన్నా ఎంతో కొంత ముట్టుజెప్పుకోక తప్పదనే అభిప్రాయాలను వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. చెక్‌పోస్టుల్లో పనిచేసే సిబ్బందిని ఇతర శాఖలకు మార్చడం ద్వారా ఆయా శాఖల్లో కొంతమేర సిబ్బంది కొరత కూడా తీరనుంది. చెక్‌పోస్టులను మూసివేయడం వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
సరిహద్దు ఆర్టీఏ చెక్‌పోస్టుల ఎత్తివేతకు
ప్రభుత్వం నిర్ణయం
త్వరలో మూసివేసేందుకు కార్యాచరణ
తీరనున్న వాహనదారుల ఇబ్బందులు
ప్రత్యేక నిఘా
పన్నులు ఎగవేసే వాహనాలపై ప్రత్యేక నిఘా వేయనున్నారు. చెక్‌పోస్టులు పూర్తిగా తొలగించినా వాటి స్థానంలో ఆరు నెలల పాటు మొబైల్ స్క్వాడ్‌లు పనిచేయనున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా వేయనున్నారు. వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించగానే వాహనాల నంబర్లను కెమెరాలు స్కాన్ చేస్తాయి. డాక్యుమెంట్ లేని వాహనాలను మాత్రం చెక్‌పోస్టు వద్ద నిలిపి వేస్తారు. అనంతరం వాటికి ఫైన్ విధించి వదిలిపెడతారు. రెండు మూడు నెలల్లో కెమెరాల బిగింపు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.