
సర్వేలు సరే.. పరిహారం?
పత్తి పంట చేలో నిలిచిన వర్షపునీరు
నారాయణఖేడ్: ప్రతీ ఏటా కొన్ని పంటలు కోతల సమయాల్లో, మరికొన్ని పంటలు చేతికొచ్చే దశలో అతివృష్టి వర్షాలతో నష్టపోతున్నారు. జిల్లాలో వేలాది ఎకరాలు పంటలు నీటిపాలవుతున్నాయి. పంట నష్టం సంభవించాక అధికారులు అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపిస్తున్నా రైతులకు మాత్రం పరిహారం అందడంలేదు. గత ప్రభుత్వం అవలంభించిన నిర్లక్ష్యాన్నే ఈ ప్రభుత్వమూ కొనసాగిస్తుండటం రైతులపాలిట శాపంగా మారింది. పంట నష్టపోయిన సందర్భాల్లో రైతులకు పరిహారం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం ఎంతగానో ఉపయోగపడేది. కానీ, తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు పంట నష్టపరిహారం అందుకోలేని దుస్థితి నెలకొంది. జిల్లాలో పక్షం రోజుల క్రితం కురిసిన అతివృష్టి వర్షాలకు 2,208 ఎకరాల్లో నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనావేసి ప్రభుత్వానికి నివేదించింది. అయితే మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు వారం వ్యవధిలోనే మళ్లీ భారీవర్షాలు జిల్లాను ముంచెత్తాయి. దీంతో మరో 3,596 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. పైన పేర్కొన్న దానికంటే అధికంగానే పంట నష్టం ఉంటుందని రైతులు చెబుతున్నారు.
బీమా లేదు.. ధీమా లేదు
ప్రతీ ఏటా వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి అధికారులు సర్వే చేసి నివేదికలు పంపుతున్నారు. గతేడాది సైతం పంపినప్పటికీ ఇంతవరకు పరిహారం అందలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా ఈ పథకం కింద రైతులు లబ్ధి పొందేవారు. కానీ, పథకాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఆ ప్రభుత్వం 2018– 19లో పథకాన్ని నిలిపివేయడంతో వర్షాలతో నష్టపోయిన రైతులకు ధీమా లేకుండా పోయింది. గతంలో పత్తికి వాతావరణ ఆధారిత బీమా, వరి, సోయా పంటలకు గ్రామ యూనిట్‌గా, ఇతర పంటలకు మండలం యూనిట్‌గా పథకాన్ని అమలు చేశారు. అతివృష్టి, అనావృష్టి సమయాల్లో నష్టపోయిన పంటలకు ఈ పథకం ద్వారా పరిహారం అందించేవారు. బీమా ప్రీమియంలో రైతులు 50% చెల్లిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25% చొప్పున చెల్లించేది. కానీ, పథకాన్ని కొన్నేళ్లుగా అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫసల్ బీమా పథకం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. వర్షాల వల్ల పంట నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు పరిహారం అందడం గాలిలో దీపంలానే మారింది. ఫసల్ బీమా ఉంటే రైతులకు ఇలాంటి సమయాల్లో ప్రయోజనకరంగా ఉండేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఫసల్ బీమా లేక రైతులకు అందని పరిహారం
2018 నుంచి పథకానికి రాష్ట్రం దూరం
రాష్ట్రం పరిహారంపైనే ఆశలు
అకాల వర్షాలతో
నెలలోనే భారీగా పంట నష్టం
ఏటా నష్టాల పాలవుతున్నాం
ప్రభుత్వాలు మారుతున్నా పంటలకు ఫసల్ బీమా చేయకపోవడంతో అకాల, అతివృష్టి వర్షాలకు ఏటా పంటలు నష్ట పోతున్నాం. ప్రభుత్వాలు పంటల బీమా చేయడంలో విఫలం చెందడంతో మాకు ఈ తిప్పలు తప్పడం లేదు. అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తే ప్రస్తుతం మేము నష్టపోయిన పెసర, పత్తి, సోయా పంటలకు బీమా పొందే అవకాశం ఉండేది. గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో మాకు నష్టాలు తప్పడం లేదు.
– డార్కు బాల్‌కిషన్,
దామర్‌గిద్దా, కంగ్టి మండలం(రైతు)

సర్వేలు సరే.. పరిహారం?