
విద్యతోపాటు క్రీడలూ ముఖ్యం
సంగారెడ్డి జోన్/సంగారెడ్డి: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలూ ఎంతో ముఖ్యమని కలెక్టర్ ప్రావీణ్య, ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డిలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన హాకీపోటీలను ఇద్దరూ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మండల కేంద్రమైన చౌటకూర్‌లో పర్యటించి గ్రామంలోని బస్తీ దవాఖాన, అంగన్‌వాడీ కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అన్ని రంగాల్లో ఆడపిల్లలను ప్రోత్సహించాలన్నారు. విద్యార్థి జీవితంలో క్రీడలు ఒక భాగంగా చేసుకోవాలని, క్రమశిక్షణ, మానసిక ఎదుగుదలకు క్రీడలు బలమైన పునాది వేస్తాయన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల లభ్యత, డిజిటల్ బోధన విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, యువజన క్రీడా శాఖ జిల్లా అధికారి ఖాసీంబేగ్, ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్, వివిధ క్రీడాకారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో గ్రామపంచాయతీ ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్‌లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య, ఎంపీ రఘునందన్
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం