
ఆయిల్ పామ్‌తో అధిక లాభాలు
న్యాల్‌కల్(జహీరాబాద్): ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారి అభినాష్ వర్మ రైతులకు సూచించారు. మండల పరిధిలోని వడ్డిలో శుక్రవారం ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందిస్తామన్నారు. పంట నిర్వహణ కోసం ఏడాదిలో ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.16,800 ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మాధవి, హెచ్‌ఈఓ విఠల్, రైతులు పాల్గొన్నారు.
295 రకంతో మంచి దిగుబడులు
జహీరాబాద్ టౌన్: వ్యవసాయ శాఖ పంపిణీ చేసిన ఎంజీజీ 295 రకం పెసర పంటతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఏఓ లావణ్య పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని కోత్తూర్(బి)లో వ్యవసాయ శాఖ ప్రదర్శించిన ఎంజీజీ 295 రకం పెసర పంటను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రాజు రైతులు పాల్గొన్నారు.