
విద్యార్థులకు అల్పాహారం
జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం మున్సిపాలలిటీ పరిధిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు పారిశ్రామికవాడలోని నీకోమాక్ పరిశ్రమ సిబ్బంది అల్పాహారం పంపిణీ చేశారు. ప్రతి ఏడాది పేద విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. పరిశ్రమ యాజమాన్యానికి ఎంఈఓ కుమార స్వామి, హెచ్‌ఎం అంజయ్య ధన్యవాదాలు తెలిపారు.
ఆలయాల్లో మహోత్సవాలు
నారాయణఖేడ్: శ్రావణమాసంలో చివరి శుక్రవారం సందర్భంగా పట్టణంలోని షిర్డీ సాయిబాబా, చక్ర లలితాంబిక దేవి ఆలయాల్లో మహోత్సవాలు ఘనంగా జరిగాయి. షిర్డీసాయిబాబా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ జ్యోషి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. అలాగే పట్టణానికి చెందిన రమేష్ మహాప్రసాదం, భారతి, విజయ్ కుమార్ దంపతులు సమస్తపూజా సామగ్రి అందించారు. అనంతరం చక్రలలితాంబిక దేవి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు పంతులు ఆధ్వర్యంలో అమ్మవారికి 10,008 గాజులతో అలంకరణ నిర్వహించారు.
అప్రమత్తంగా ఉండాలి
ఝరాసంగం(జహీరాబాద్): వినాయక చవితి పండుగ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ మంజుల, ఎస్‌ఐ క్రాంతి కుమార్ పాటిల్ సూచించారు. శుక్రవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పండుగ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు.
సింగూరుకు తగ్గిన వరద
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టడంతో మూడు క్రస్టు గేట్‌లను మూసివేశారు. ప్రస్తుతం 9, 11 గే ట్‌లను రెండు మీటర్ల పైకి ఎత్తి దిగువకు 18 ,672 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.