
సమన్వయంతో పని చేయాలి
సంగారెడ్డి జోన్: వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరిగితే నివారించే పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండే విధంగా వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా సరిపడా క్రేన్లు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, డీఆర్‌ఓ పద్మజారాణి పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్