
విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ
● రూ.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● మంత్రి దామోదర రాజనర్సింహ
మునిపల్లి(అందోల్): విద్య, వైద్యం, రవాణ సౌకర్యం మెరుగుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో కలెక్టర్ పి.ప్రావీణ్యతో కలిసి సుసమారు రూ.70 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన, భూమి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ...రాష్ట్రంలోనే మునిపల్లిలోని బుదేరా మహిళా డిగ్రీ కళాశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు భద్రతతోపాటు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. రోడ్ల నిర్మాణంతో తక్కడపల్లి, గార్లపల్లి గ్రామాల ప్రజలకు హోటళ్లు, చేపలు పట్టుకునే వారికి ఉపాధి అవకాశం దొరుకుతుందని చెప్పారు. వారంలో పనులు ప్రారంభమవుతాయని, ఇప్పటికే రోడ్ల అభివృద్ధికి టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు. తాటిపల్లి కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు డైనింగ్ హాలు, తరగతి గదుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు.