
ఆశయం ఆదర్శమై..
● ‘సాక్షి’కథనాలతో ఉపాధ్యాయులకు దక్కిన గౌరవం ● ఎస్‌ఈఆర్టీ మ్యాగజైన్‌లో చోటు ● ఉపాధ్యాయుల ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ‘సాక్షి’కథనాలతో ఉపాధ్యాయులకు అరుదైన గౌరవం దక్కింది. సదాశివపేట మండలంలోని నిజాంపూర్(కే) ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెచ్‌ఎం రామకృష్ణ, ఉపాధ్యాయురాలు సునీత ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఎస్‌ఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) ప్రచురించే ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు కల్పించింది. ఇందుకుగాను గతంలో ‘సాక్షి’పత్రికలో ప్రచురితమైన ‘సర్కార్ స్కూల్..అడ్మిషన్స్ ఫుల్’,’పర్యావరణం.. బోధన వినూత్నం’తదితర కథనాలు దోహదం చేశాయి. హెచ్‌ఎం రామకృష్ణ గతంలో సదాశివపేట పట్టణంలోని రవీంద్ర మోడల్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో విధులను నిర్వహించే సమయంలో చేసిన కృషిని ‘సాక్షి’గుర్తించి ‘సర్కార్ స్కూల్.. అడ్మిషన్స్ ఫుల్’కథనం ప్రచురించడం జరిగింది. దీన్నే ఆయన తన సక్సెస్ స్టోరీగా, ఉపాధ్యాయురాలు సునీత ‘కాకమ్మ కథల లాగా బోధిస్తేనే కదా పిల్లలకు ఆసక్తి’అనే అంశాన్ని తన సక్సెస్ స్టోరీగా వివరించడంతో ఎస్‌ఈఆర్టీ తన ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు కల్పించింది. రాష్ట్రంలో మొత్తం 51 పాఠశాలల ఉపాధ్యాయులు ఎంపిక కాగా సంగారెడ్డి జిల్లా నుంచి రామకృష్ణ, సునీతలు ఎంపికయ్యారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ‘సాక్షి’దినపత్రికకు, ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్ రమేశ్,స్కూల్ లీడర్‌షిప్ అకాడమీ కన్సల్టెంట్ సురేశ్‌బాబు, సభ్యులు మధుసూదన్‌రెడ్డి, వెంకట రమణమ్మ, జగదీశ్వర్‌రెడ్డికి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించిన డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ శంకర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా విద్యాశాఖకు ఇంతటి గౌరవాన్ని తెచ్చిన రామకృష్ణ, సునీతలను ఎంఈవో శంకర్, అధికారి సుధాకర్, కాంప్లెక్స్ హెచ్‌ఎం రాజశ్రీ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించారు.

ఆశయం ఆదర్శమై..