
డ్రోన్‌లతో సాగు!
ఎకరాకు పది నిమిషాల్లో మందుల పిచికారీ
జహీరాబాద్ టౌన్: జిల్లాలోని రైతులు ఖరీప్ సీజన్‌లో పత్తి, సోయాబిన్, కంది తదితర పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పత్తి తదితర పంటలు ఏపుగా పెరిగాయి. పంట ఎదుగుదల, పూత, కాత కోసం రైతులు మందులు పిచికారీ చేస్తున్నారు. అధిక వర్షాలకు పంట రంగు మారుతుండడంతో మందులు పిచికారీ చేయాల్సి వస్తుంది. అయితే కూలీల కొరత, పెరిగిన పెట్టుబడులతో రైతులు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ క్రమంలో కొంత మంది రైతులు డ్రోన్‌ల సహాయంతో పంటలకు మందులు పిచికారీ చేయిస్తున్నారు. ప్రధానంగా జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలువురు రైతులు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించుకుంటున్నారు. కొంత మంది డ్రోన్‌లు అద్దెకు నడుపుతున్నారు. డ్రోన్‌లు ఎకరా పంటను కేవలం పది నిముషాల్లో మందులను పిచికారి చేస్తుంది. నేరుగా మొక్కలపై మందులను పిచికారీ చేయడంతో మందు వృథా కావడంలేదు. ఇద్దరు కూలీలు అవసరమయ్యే పనిని ఒక్క డ్రోన్ తక్కువ సమయంలో పూర్తి చేస్తుంది. అయితే గతంలో మందులు పచికారీ చేస్తున్న సమయంలో రైతులు ఇబ్బందులు పడేవారు. కొంతమందికి ఏకంగా ముక్కు, నోరు, శరీరంపై పడి ఆస్పత్రుల పాలయ్యేవారు, కానీ డ్రోన్ వచ్చాక ఈ ప్రమాదం నుంచి ఉపశమనం కలిగింది. మందుల వృథాతో పాటు ఖర్చులు కూడా తగ్గుతుండడంతో ఎక్కువమంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
టెక్నాలజీని సద్వినియోగం
చేసుకుంటున్న రైతులు
సమయం, కూలీ ఆదాతో తప్పిన ఇబ్బందులు
వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. విత్తనాలు చల్లడంతో పాటు మందులను తక్కువ సమయంలో సులువుగా పిచికారీ చేస్తుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ మారుమూల గ్రామాలకు చేరింది. దీంతో పంటల సాగులో వ్యయం తగ్గించడం కోసం రైతులు ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా కూలీల కొరత అధిగమించేందుకు డ్రోన్‌ల సాయంతో క్రిమిసంహాకర మందులు పిచికారీ చేయిస్తున్నారు. త్వారా ఖర్చు తగ్గడంతో పాటు తక్కువ సమయంలో అధిక విస్తీర్ణంలో మందును పిచికారీ చేసేందుకు వెసులుబాటు కల్గుతుంది.