
పంట.. వర్షం తంటా!
పొలాల్లో నిల్వ నీరు
● దెబ్బతింటున్న పంటలు
● ఆందోళనలో రైతులు
న్యాల్‌కల్(జహీరాబాద్): జిల్లాలో వారం రోజుల నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. తేమ అధికం కావడంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఫలితంగా పంటలను రక్షించుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 7.50 లక్షలు ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే.. ఇప్పటి వరకు 6,88,50 ఎకరాల్లో పంటలను రైతులు సాగు చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా 3,45,954 ఎకరాల్లో పత్తి పంట, 1,21,535 ఎకరాల్లో వరి, 67,556 ఎకరాల్లో సోయా, 73,557 ఎకరాల్లో కంది, 12,071 ఎకరాల్లో పెసర, 9,688 ఎకరాల్లో మినుము చేసుకోగా మిగిలిన 1,20,000 ఎకరాలో్‌ల్ చెరకు, జొన్న, మొక్క జొన్న తదితర పంటలను రైతులు సాగు చేసుకున్నారు.
వారం నుంచి వానే వాన
వారం రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిత్యం కురుస్తుండటంతో పంట పొలాల్లో నీరు నిలబడుతుంది. దీంతో తేమ అధికమై పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా సాగు చేసిన పత్తి పంటలో నీరు నిలబడి అది పచ్చగా మారుతుంది. లోతట్టు ప్రాంతాల్లో పంటలు అధికంగా దెబ్బతింటున్నాయి. పెసర, మినుము, సోయా తదితర పంటలు కూడా దెబ్బతింటున్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే కురిస్తే పంటలు అధికంగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి
జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా రైతులు చూసుకోవాలి. పంట పొలాల్లోంచి నీరు బయటకు వెళ్లేలా కాల్వలను తీసుకోవాలి. పంటలు దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఏఓలు, ఏఈఓలకు సూచించాం.
శివ ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ
అధికారి–సంగారెడ్డి
పంటలు దెబ్బతింటున్నాయి
నాకున్న ఎనిమిది ఎకరాలు, మరో 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేస్తున్నా. నెలాఖరులో కురిసిన వానల వల్ల పంటలు బాగుండగా, కొన్ని రోజుల నుంచి రోజు వానలు పడుతుండటంతో పొలంలో నీరు నిలబడి పంట దెబ్బతింటుంది. కౌలుకు తీసుకొని రూ.లక్షల పెట్టుబడి పెట్టాం.
– నిరంజన్, రైతు, ముంగి గ్రామం

పంట.. వర్షం తంటా!

పంట.. వర్షం తంటా!

పంట.. వర్షం తంటా!