డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు

Jun 20 2023 3:42 AM | Updated on Jun 20 2023 12:57 PM

మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌ - Sakshi

మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రామచంద్రాపురం: తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం వివిధ శాఖల అధికారులు కొల్లూరుకు చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ నెల 22న ఉదయం 10గంటలకు ఇళ్ల ప్రాంగణానికి చేరుకొని పైలాన్‌ ప్రారంభించి, ఫొటో ఎగ్జిబిషన్‌ తిలకిస్తారు. అనంతరం 98వ బ్లాక్‌ వద్ద డబుల్‌ బెడ్రూం ఇళ్లను లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే బ్లాక్‌లోని మొద టి అంతస్తులో సుమారు 6నుంచి 12 మంది లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలను అందజేస్తారు.

నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కొల్లూరు వద్ద ఆసియాలోనే అతిపెద్ద టౌన్‌షిప్‌ను నిర్మించింది. 15 వేలకు పైగా డబుల్‌బెడ్‌రూం గృహాలను నిర్మించింది. సుమారు 60 వేల మంది నివసించేలా అక్కడ అన్ని మౌళిక సదుపాయాలను కల్పించింది. దీన్ని నిర్మించి దాదాపు ఐదేళ్లు దాటుతున్నప్పటికీ.. లబ్దిదారులకు అందించలేదు. గతంలో పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ వాయిదా పడింది. తాజాగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ గృహాలను గురువారం లబ్ధిదారులకు అందించనున్నారు.

సీఎం పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌
సీఎం కేసీఆర్‌ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారుల సమావేశంలో కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ ఆదేశించారు. సోమవారం పటాన్‌చెరు పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, ఎస్పీ రమణ కుమార్‌, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నెల 22న పాల్గొననున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

సీఎం కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు త్రాగునీరు, ఫస్ట్‌ ఎయిడ్‌, అంబులెన్స్‌, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. పారిశుధ్య నిర్వహణ లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులతో అన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా తగినచర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ వీరారెడ్డి, డీఎంహెచ్‌ఓ గాయత్రి, జిల్లా పంచయతీ అధికారి సురేశ్‌ మోహన్‌, డీఎండబ్ల్యూఓ అరుణ్‌ కుమార్‌, గీత, డీఎస్పీ భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్న 98వ బ్లాక్‌ 1
1/1

సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్న 98వ బ్లాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement