సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు.. ఆర్జీవీ!
విమర్శలకు బెదరడు.. మనసులో ఉన్న చెప్పకా మానడు.
తన ట్వీట్లతో తరచూ వివాదాల్లో ఉండే ఈ సినీ దర్శక దిగ్గజం...
తాజాగా విద్యా వ్యవస్థపై తన విమర్శలను ఎక్కుపెట్టాడు.
కృత్రిమ మేధ అంతకంతకూ విసృ‍్తతమవుతున్న ఈ తరుణంలో..
పాత పద్ధతులనే పట్టుకు వేళ్లాడటం ఆత్మహత్య సదృశ్యమని స్పష్టం చేశాడు.
ఈ మేరకు ఆర్జీవీ చేసిన ఎక్స్ పోస్ట్. తెలుగులో మీ కోసం...
హే.. స్టూడెంట్స్... మేలుకోండి. చదువు చచ్చిపోతోంది. ఉత్సవాలు జరుపుకోండి!
కృత్రిమ మేథ ఎంత వేగంగా పెరుగుతోందో.. అన్ని వర్గాల వారూ దాన్ని వాడటం కూడా అంతే స్పీడుగా జరిగిపోతుంది. ఈ కాలపు చదువులు చచ్చిపోతున్న విషయమే అందుకు రుజువు. వైద్యవిద్యను ఉదాహరణగా తీసుకుందాం...
వైద్య విద్యార్థి మానవ శరీరం, దాని పనితీరులను అర్థం చేసుకునేందుకు ఐదేళ్లు ఖర్చు చేస్తాడు. ఆ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఇంకో రెండేళ్లు.. ఆపై స్పెషలైజేషన్ కోసం మరో రెండుమూడేళ్లు పనిచేయాలి. అంటే సుమారు దశాబ్ధకాలం ఆ విద్యార్థి శరీర కండరాలు, నాడులు, అవయవాలు.. వాటి పనితీరు, పనిచేసే విధానం గురించి నెమరేసుకుంటూనే ఉంటాడన్నమాట. వీటన్నింటి ఆధారంగా శరీరంలో ఏది సరిగా లేదో గుర్తించి తగిన చికిత్స ఇస్తాడు. అయితే...
కృత్రిమ మేథ మహా శక్తిమంతమైంది. లక్షల మెడికల్ కేసులు అరక్షణంలో చదివేయగలదు. రోగుల సమాచారాన్ని స్కాన్ చేసేసి.. రోగమేమిటో వేగంగా, కచ్చితంగా తేల్చయగలదు. అది కూడా ఎలాంటి వివక్ష లేకుండా ఏ చికిత్స తీసుకోవాలో కూడా సూచిస్తుంది. అలాంటప్పుడు ఒక యంత్రం పది సెకన్లలో చేసే పని కోసం పదేళ్లు వృథా చేయడం ఎంత వరకూ కరెక్ట్?
ఓ ప్రముఖ వైద్యుడు నాతో పంచుకున్న విషయాలు చూస్తే.. ఒళ్లు జలదరిస్తుంది!
‘‘చాలా బాధేస్తోందండి. చాలామంది పేద పిల్లలు వైద్య కళాశాలల్లో చేరుతున్నారు. కానీ చదువు పూర్తి చేసి వచ్చేసరికి.. వీళ్లకు చేసే పనేమీ ఉండదు’’ అన్నారు ఆయన.
ఇదేదో కల్పన కాదు. ఈ కాలపు వాస్తవం.
వైద్యం ఒక్కటే కాదు.. ఏ రకమైన ఇతర కోర్సులకైనా ఇది వస్తుంది.
ఏఐ రాజ్యమేలే ప్రపంచంలో సంప్రదాయ విద్యావ్యవస్థను పట్టుకు వేళ్లాడటం వెనక్కు నడవడమే. తెలివితక్కువతనం కూడా.
మనదంతా భట్టీ పట్టేసే విద్యా వ్యవస్థ. సమాచారం అన్నది చాలా అరుదుగా దొరికే కాలంలో సిద్ధం చేశారు దీన్ని. కానీ ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా చటుక్కున దొరుకుతోంది. భట్టీ పట్టేడయం, జ్ఞాపకం చేసుకోవడం ఇప్పుడు జ్ఞానం కానేకాదు. మూర్ఖత్వం.
నలభై ఏళ్ల క్రితం గుర్తుండి పోయేంతవరకూ ఎక్కాలు అప్పజెప్పేవాళ్లం. ఆ తరువాత కాలిక్యులేటర్లు వచ్చాయి. ఎక్కాలు నెమరేయడం మానేశాం.
‘‘మన మెదళ్లు లెక్కపెట్టడం మరచిపోతే ఎలా’’, ‘‘ఏదో ఒక రోజు యంత్రాలూ పనిచేయకపోతే? అని కొందరు డౌట్లూ లేవనెత్తారు.
ఇదెలా ఉంటుందంటే... కారు సరిగ్గా పనిచేయదేమో అనుకుని గుర్రపు బగ్గీని రెడీగా పెట్టమన్నట్లు!
పాత పద్ధతులే సుఖం అనుకునే వారికి విప్లవాత్మకమైన మార్పులన్నీ కుట్రల్లాగే కనపడతాయి. అదే భయం, అభద్రత, తమల్ని తాము కాపాడుకునేందుకు వాడే అబద్ధాలే ఇప్పుడు కృత్రిమ మేధ విషయంలో మళ్లీ తెరపైకి వస్తున్నాయి.
ఈ కాలపు ఏఐ విప్లవం విశ్వవిద్యాలయాల కోసం మంత్రులు లేదంటే పాతవాసన కొట్టే బోర్డుల ఆమోదం కోసం ఎదురు చూడటం లేదు. ఎదగని వాటిని తుడిచిపెట్టేస్తుంది. ఈ లైన్‌లో మొట్టమొదట ఉండేది విద్యార్థులే. కాబట్టి... విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వెంటనే తీసుకురావడం అనేది అవసరం మాత్రమే కాదు.. మన మనుగడకు కీలకం కూడా.
లేదంటే... ఈనాటి విద్యార్థులే బలిపశువులు. ఏమీ తెలియని తల్లిదండ్రులు, అజ్ఞానులైన విధాన రూపకర్తల మోసానికి వీరు బలికాక తప్పదు. వీళ్లే కదా.. ఇప్పటి విద్యార్థులను ‘లేని’ ఉద్యోగాల కోసం సిద్ధం చేస్తున్నది?!
తరగతి గదుల్లో ఏఐ టూల్స్ వాడకాన్ని వెంటనే మొదలుపెట్టాలి. ఇదేదో పరీక్షల్లో చీటింగ్ చేసేందుకు కాదు. విద్యార్థులకు అవసరమైన అసిస్టెంట్లుగా!
చదువు చెబుతున్నామన్న భ్రమల నుంచి పాఠశాలలు బయటపడటం మంచిది. విద్యార్థులు కృత్రిమ మేథ టూల్స్‌ను ఎంత తెలివిగా, సృజనాత్మకంగా వాడుతున్నారో పరీక్షించేందుకు మాత్రమే పాఠశాలలు పరిమితం కావాలి.
భవిష్యత్తులో క్వశ్చన్ పేపర్లు.. ‘‘మీకేం తెలుసు’’ అని అడక్కూడదు. ఏఐతో ఎంత వేగంగా, లోతుగా, సృజనాత్మకంగా పనిచేయించుకోగలరో చూడాలి.
ఎందుకంటే..... అన్నీ తెలిసినవాడు కాదు. ఏఐని సరైన ప్రశ్న వేయగలిగిన వాడు మాత్రమే జీనియస్!
విద్యార్థులూ... ఏఐ సృష్టించే విధ్వంసం ముంగిట్లో ఉన్నారు మీరు.
మీ టెక్ట్స'బుక్‌ల కింద పునాదులు కదిలిపోతున్నాయి. గుర్తించండి.
మీ డిగ్రీలు.. వాటిని ప్రింట్ చేసేందుకు వాడే కాగితంతోనూ సరిపోవు.
చచ్చిపోయిన వ్యవస్థ అవశేషాల మధ్య మీ ప్రొఫెసర్లు మీకు పాఠాలు చెబుతున్నారు.
ఇంకా పాత పద్ధతుల్లోనే చదువుకుంటే... మీరు కాలగతిలో కలిసిపోతారు.
ఏఐ మిమ్మల్ని తినేయదు కానీ.. మిమ్మల్ని పట్టించుకోకుండా సాగిపోతూంటుంది. అంతే!
కాబట్టి... మార్కుల కోసం చదవడం ఆపేయండి.
ఏఐని ఎలా వాడాలో నేర్చుకోండి! ఎందుకంటే... ఏఐని వాడకం తెలియని వాళ్లను ఆ ఏఐ మింగేస్తుంది!
నోట్: నా ఈ రాతలపై సహేతుక అభ్యంతరాలకు సమాధానం ఇచ్చేందుకు నేను రెడీ!
EDUCATION is DEAD
Hey students wake up and CELEBRATE the DEATH of EDUCATION
The explosion of A I will be in direct proportion to a public acknowledgement by all concerned, that our present day education system is dead
Here’s looking at the medical course for an example
A…— Ram Gopal Varma (@RGVzoomin) November 13, 2025


