ఫ్యూచర్‌.. వైర్‌లెస్‌! | - | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌.. వైర్‌లెస్‌!

Aug 5 2026 8:39 AM | Updated on Aug 5 2026 8:39 AM

పాతిన విద్యుత్‌ స్తంభాల తొలగింపు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ బాధితుల వెంచర్‌ను పూర్తిగా వైర్‌లెస్‌ సిటీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఓవర్‌హెడ్‌లైన్ల స్థానంలో భూగర్భ విద్యుత్‌ కేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ రూ.18 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే నాటిన విద్యుత్‌ స్తంభాలను తొలగించింది. ప్రధాన రహదారులు, కాలనీ వీధుల్లోనే కాదు.. ఇంటి ముందు కూడా ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ లైన్లు కన్పించకూడదని భావిస్తోంది. వాటిస్థానంలో 3.6 కిలోమీటర్ల మేర 11 కేవీ భూగర్భ విద్యుత్‌ కేబుళ్లు (యూజీ కేబుల్స్‌), 120 కిలోమీటర్ల ఎల్టీ యూజీ కేబుల్స్‌ సహా సుమారు 30 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మార్లు, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయనుంది. ఇందుకు అవసరమైన బడ్జెట్‌ విడుదల కావడమే ఆలస్యం పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.

మీర్‌ఖాన్‌పేటలో భారీ వెంచర్‌

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో కందుకూరు, యాచారం మండలాల పరిధిలోని పది గ్రామాల్లో 19,333 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఆ మేరకు కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట, ముచ్చర్ల, పంజాగూడ రెవెన్యూల పరిధిలో 1,433 మంది రైతుల నుంచి సుమారు నాలుగు వేల ఎకరాల భూమిని, యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్‌, తాడిపర్తి, కుర్మిద్ద, కడ్తాల్‌ మండల పరిధిలోని పల్లెచల్కతండా పరిధిలోని ఆరు వేల మంది రైతుల నుంచి సుమారు తొమ్మిది వేల ఎకరాల చొప్పున మొత్తం 13,500 ఎకరాలు సేకరించింది. భూములు కోల్పోయిన రైతులకు పట్టా భూమికి ఎకరానికి రూ.12.50 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు, అసైన్డ్‌ భూములకు రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించింది. అంతేకాదు ఎకరానికి 121 గజాల ప్లాట్‌ ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మేరకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) మీర్‌ఖాన్‌పేట్‌ రెవెన్యూ సర్వే నంబర్‌ 120 సహా పంజాగూడ రెవెన్యూ సర్వే నంబర్‌ 90, 91లలో 600 ఎకరాలు సేకరించి, భారీ వెంచర్‌ అభివృద్ధి చేసింది. 2023లో బీఆర్‌ఎస్‌ తన అధికారాన్ని కోల్పోవడం, 2024లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, ఫార్మాసిటీని రద్దు చేసి, దాని స్థానంలో భారత్‌ ఫ్యూచర్‌సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.

రూ.18 కోట్లతో

భూగర్భ కేబుళ్లు

ఫ్యూచర్‌సిటీ భూ బాధితులకు ప్రత్యేకం

మీర్‌ఖాన్‌పేటలో 600 ఎకరాల్లో వెంచర్‌

ఇప్పటికే బాధితులకు ప్రొసీడింగ్స్‌ జారీ

వైర్‌లెస్‌ సిటీగా నిర్మాణానికి ప్రతిపాదనలు

లబ్ధిదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంచర్‌ టలోని ఖాళీ ప్లాట్లకు నంబర్లు వేసింది. విశాలమైన రోడ్లు, పార్కులు, ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేసింది. ప్లాట్ల పంపిణీలో పారదర్శకత కోసం లబ్ధిదారుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహించింది. కందుకూరు మండలంలో 1,433 మంది రైతులకు 1,234 మందికి, యాచారం మండలంలోని 4,500 మంది బాధితులకు ప్రొసీడింగ్స్‌ ఇచ్చింది. ఇదే సమయంలో నష్ట పరిహారం పొందిన భూ బాధితుల్లో భారీగా నకిలీలు ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటికే లబ్ధిదారుల పేరున పంపిణీకి సిద్ధం చేసిన ప్లాట్ల ప్రొసీడింగ్స్‌ బాధితుల చేతికి ఇవ్వకుండా తాత్కాలికంగా నిలిపివేసింది. 2025 డిసెంబర్‌లో ఇదే వేదికగా గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించిన ప్రభుత్వం ఫార్చూన్‌–500 కంపెనీలకు ఇక్కడికి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్‌ ఫ్యూచర్‌సిటీని తీర్చిదిద్దబోతున్నట్లు తెలిపింది. ఆ మేరకు ఫ్యూచర్‌సిటీ మొత్తం భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తొలి విడతగా లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్లలో యూజీ కేబుళ్లను ఏర్పాటు చేసి, తర్వాత వచ్చే విద్యుత్‌ డిమాండ్‌ను బట్టి ఇతర ప్రాంతాలకు పనులు విస్తరించాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement