కొందుర్గు: పశువులను మేపుతుండగా ఓ మహిళా రైతు పాముకాటుకు గురైంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని మహదేవ్‌పూర్ గ్రామశివారులో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లంకాల వెంకట్‌రెడ్డి, వనజ (35) దంపతులు. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. మంగళవారం వెంకట్‌రెడ్డి చేనుకు ఎరువులు చల్లుతుండగా వనజ పొలం సమీపంలో పశువులను మేపుతున్నారు. అదే సమయంలో తన కాలుకు ఏదో పాము కరిచినట్లు ఉందని ఆమె ఫోన్ ద్వారా భర్తకు చెప్పారు. వెంటనే వెంకట్‌రెడ్డి వెళ్లి చూడగా స్పృహ తప్పి పడి పోయింది. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ సహాయంతో షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మహదేవ్‌పూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.


