తాగునీటికి అధిక ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

తాగునీటికి అధిక ప్రాధాన్యత

Aug 5 2026 8:39 AM | Updated on Aug 5 2026 8:39 AM

తాగునీటికి అధిక ప్రాధాన్యత

మోమిన్‌పేట: జిల్లాలో తాగు, సాగునీటి కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. మోమిన్‌పేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో తాగునీటి అవసరాల కోసం రూ.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఏ గ్రామంలో కూడా నీటి సమస్య ఉండొద్దన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు తెస్తే గత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌తో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు నీరిచ్చే అవకాశం లేదన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జూరాల నుంచి జిల్లాకు సాగునీరు ఇవ్వాలని కోరామన్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. నియోజకవర్గంలో రూ.300 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు వేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్‌ శాఖ ఏఈఈ అందుబాటులో ఉండడం లేదని, ఫోన్‌ చేసినా స్పందించడం లేదని పలువురు సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. అధికారుల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు ఫోన్‌ చేస్తే స్పందించాలని సూచించారు. మన ఊరు – మన బడి పథకం కింద చేసిన పనులకు దాదాపు రూ.25 లక్షల బిల్లు రావాల్సి ఉందని టేకులపల్లి సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. వెంటనే మంజూరయ్యేలా చూస్తామని స్పీకర్‌ హామీ ఇచ్చారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలల భవనాలను కూల్చి వేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఎన్కేపల్లి సర్పంచ్‌ సురేందర్‌ కోరారు. కలెక్టర్‌ దీపక్‌ తివారి మాట్లాడుతూ.. సర్పంచ్‌లు సభ దృష్టికి తెచ్చిన సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ సుధీర్‌, మండల ప్రత్యేకాధికారి సదానందం, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ రాజమల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement