సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి.. విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా విద్యా శాఖ సరికొత్త కార్యాచరణ ప్రణాళి కకు సిద్ధమైంది. 2026–27 విద్యాసంవత్సరానికి నిర్దేశించుకున్న ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు సీనియర్ అధికారు లను జిల్లాల వారీగా ‘ప్రత్యేకాధికారులు’గా (స్పెషల్ ఆఫీసర్లు) నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. నిరంతరం బడులను తనిఖీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శికి ఎప్పటిక ప్పుడు సమగ్ర నివేదికలు సమర్పిస్తూ ఎక్కడైనా లోపాలు కనిపిస్తే ఆ క్షణానే సరిదిద్దేలా ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
చేరికల నుంచి మౌలిక వసతుల వరకు..
జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలల స్థితిగతులపై ఈ అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బడుల్లో జరుగుతున్న సివిల్ పనులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయనున్నారు. విద్యార్ధులకు అందించే ‘మధ్యాహ్న భోజనం’తో పాటు ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ స్కీమ్ నాణ్యతను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల పంపిణీ వంద శాతం పూర్తయ్యేలా సమన్వయం చేస్తారు.
టెక్నాలజీతో చెక్
సాంకేతికతను జోడించి సర్కారు చదువులను కార్పొరేట్‌కు పోటీగా నిలబెట్టేందుకు 19 కీలక అంశాలపై నిరంతర సమీక్ష నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పక్కాగా అమలు చేయాలని భావిస్తున్న ‘ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్’ (ముఖ గుర్తింపు హాజరు) విధానం, బడి మానేసిన పిల్లల (డ్రాపౌట్లు) గుర్తింపు, ఫౌండేషనల్ లిటరసీ ప్రోగ్రామ్‌లపై నిఘా పెట్టనున్నారు. దీంతో పాటు ఆన్‌లైన్ విద్యలో విప్లవాత్మక మార్పుల కోసం ప్రముఖ డిజిటల్ ఇనిషియేటివ్స్ ద్వారా డిజిటల్ పాఠాలు విద్యార్థులకు ఏ మేరకు అందుతున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
ప్రత్యేకాధికారులు వీరే ..
ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాకు ఎం. రాధారెడ్డి, రంగారెడ్డి– కె.లింగయ్య, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు రమణకుమార్, సంగారెడ్డికి జి.రమేష్‌ను స్పెషలాఫీసర్లుగా నియమించారు.
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యపై ఫోకస్
విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా స్పెషలాఫీసర్లు
హాజరు, మౌలిక వసతులు, డిజిటల్ బోధనపై నిఘా
నిరంతరం ప్రత్యేకాధికారుల తనిఖీలు


