హెచ్‌ఆర్‌ఈటీఎస్‌ టోర్నీ విజేతగా గోల్కొండ జట్టు | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఆర్‌ఈటీఎస్‌ టోర్నీ విజేతగా గోల్కొండ జట్టు

Apr 11 2026 9:46 AM | Updated on Apr 11 2026 9:46 AM

మొయినాబాద్‌: హెచ్‌ఆర్‌ఈటీఎస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో గోల్కొండ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ జట్టు విజయకేతనం ఎగురవేసింది. మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరులో ఉన్న న్యూ మాడీస్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో 2026 హెచ్‌ఆర్‌ఈటీఎస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నెల రోజుల పాటు జరిగింది. ఈ టోర్నమెంట్‌లో నగరంలోని 20 హోటల్స్‌కు చెందిన క్రికెట్‌ జట్లు పాల్గొని తలపడ్డాయి. మొదటి నుంచి అద్భుత ప్రదర్శనతో వరుసగా ఐదు విజయాలు సాధించిన గోల్కొండ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ జట్టు ఓటమి లేకుండా టోర్నమెంట్‌ విజేతగా నిలిచింది. శుక్రవారం విజేత జట్టుకు ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో గోల్కొండ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ డైరెక్టర్‌ శ్యామల శ్రీనివాస్‌రెడ్డి, జనరల్‌ మేనేజర్‌ ఏకాంత్‌ సబర్వాల్‌, కెప్టెన్‌ ప్రణీత్‌ పాల్గొన్నారు.

జీఎన్‌ఐటీసీ అధ్యాపకుడికి పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌

ఇబ్రహీంపట్నం రూరల్‌: గురునానక్‌ ఇనిస్టిట్యూషన్స్‌ టెక్నికల్‌ క్యాంపస్‌లో పని చేస్తున్న అధ్యాపకుడు డాక్టర్‌ డి.సురేంద్రరావుకు పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ లభించింది. శుక్రవారం ఎస్‌ఆర్‌ వర్సిటీలో డాక్టర్‌ సందీప్‌ భట్టాచార్య సమక్షంలో, డాక్టర్‌ కె. శ్రీధర్‌రెడ్డి మార్గదర్శకత్వంలో ఆయనకు వీసీ ప్రొఫెసర్‌ దీపక్‌ గార్గ్‌ ఫెలోషిప్‌ ప్రదానం చేశారు. నిజ ప్రపంచ వాతావరణంలో విశ్వసనీయమైన, గోప్యతను కాపాడే మానవ చర్యల గుర్తింపునకు మల్లీమోడల్‌, ఎమోషనల్లీ ఇంటెలిజెంట్‌ ఫెడరేటెడ్‌ డీప్‌ లెర్నింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడంపై డాక్టర్‌ సురేందర్‌రావు పరిశోధన కేంద్రీకృతమై ఉంది. ఆయన కృషి సురక్షిత ఏఐ వ్యవస్థలు ఇంటెలిజెంట్‌ కంప్యూటింగ్‌, డేటా గోప్యత వంటి అబివృద్ధి చెందుతున్న రంగాలకు దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా జీఎన్‌ఐటీ యాజమాన్యం సురేందర్‌రావును ప్రశంసించారు.

ఫార్మాసిటీ భూముల్లో కేంద్ర బృందం పర్యటన

అధికారులతో మాట్లాడి వివరాల సేకరణ

యాచారం: కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం శుక్రవారం ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో పర్యటించింది. తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీకి సేకరించిన ప్రభుత్వ, అసైన్డ్‌, పట్టా భూముల్లో పర్యటించి టీజీఐఐసీ ఉన్నతాధికారుల ద్వారా వివరాల సేకరించారు. సేకరించిన భూముల్లో ఏఏ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు? రైతులకు ఏ మేరకు పరిహారం అందజేశారు? స్థానిక రైతుల జీవనోపాధులు తదితర అంశాలపై ఆరా తీశారు. హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీసుల బందోబస్తు మధ్య కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం పర్యటన కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ జ్యోతి, సహ ఉద్యోగి వరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

తులేకలాన్‌ అభివృద్ధికి సహకరించండి

తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డిని కోరిన పాలకవర్గం

ఇబ్రహీంపట్నం రూరల్‌: తులేకలాన్‌ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డిని గ్రామ పంచాయతీ పాలవకర్గం కోరింది. ఈ మేరకు శుక్రవారం వారు నగరంలోని ఆయన కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సామేలు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2.50 కోట్లు నిధులు అవసరమున్నాయని చెప్పారు. ఇందుకు స్పందించిన ఆయన తాను జన్మించిన గ్రామాభివృద్ధికి తప్పక సహాయసహకారాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సామ అశ్వినీరవీందర్‌రెడ్డి, కౌన్సిలర్‌ చిలుకల బుగ్గరాములు, ఉప సర్పంచ్‌ జగదీశ్‌, మాజీ సర్పంచ్‌లు యెర్నాగి రవీందర్‌, యాదగిరి, బీరప్ప, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బాసాని రాజిరెడ్డి, వార్డు సభ్యులు మహేశ్‌, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

హైటెన్షన్‌ బాధితులకు న్యాయం చేయండి

మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, అంజయ్య యాదవ్‌

కడ్తాల్‌: 765 కేవీ బీదర్‌–మహేశ్వరం హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటుతో రైతులు నష్టపోతున్నారని వారికి సరైన న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, అంజయ్య యాదవ్‌, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డిని కలిసి సమస్యను వివరించారు. రైతులకు న్యాయం చేసే వరకు ఆందోళన చేపడతామన్నారు. అనంతరం బాధిత రైతులతో కలిసి అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రాములుయాదవ్‌, జంగారెడ్డి, పెంటారెడ్డి, రామకృష్ణ, శ్రీరాములు, పర్వత్‌కుమార్‌ యాదవ్‌, గిరి యాదవ్‌, శ్రీశైలం, చంద్రశేఖర్‌, జంగయ్య, యాదయ్య, కేశవులు, సత్యనారాయణ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement