● వాటర్ ట్యాంకు ఎక్కిన రైతు కుటుంబం
● పోలీసుల రంగప్రవేశంతో దిగివచ్చిన వైనం
మంచాల: దాయాదులతో భూ సమస్య కారణంగా ఓ రైతు కుటుంబం వాటర్‌ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ నిరసన వ్యక్తం చేశారు. వివరాలు.. మండల పరిధిలోని అస్మత్‌పూర్ గ్రామానికి చెందిన రైతు పుట్ట ఐలయ్యకు అన్నదమ్ములతో భూతగాదాలున్నాయి. దీంతో విసుగు చెందిన ఆయన భార్య ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడితో కలిసి జాపాల–కాగజ్‌ఘట్ మధ్య ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కారు. అన్నదమ్ములు పెట్టే ఇబ్బందుల కారణంగా తమంతా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఎంత నచ్చజెప్పినా దిగిరాలేదు. విషయం తెలుసుక్ను మంచాల సీఐ మధు వెంటనే బాధితుడికి ఫోన్ చేసి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఘటనా స్థలికి చేరుకుని వారిని క్షేమంగా కిందకు రప్పించి ఠాణాకు తీసుకెళ్లారు.
ఏసీపీ రాజు కౌన్సెలింగ్
ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు సూచించారు. కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. మీకు అండగా ఉంటాం. అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం ఐలయ్య కుటుంబ సభ్యులు మరోమారు ఇలాంటి తప్పుడు పనులు చేయమంటూ పోలీసులకు హామీ ఇచ్చి ఇంటికి వెనుదిరిగారు.


