ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డిదే? | Sakshi
Sakshi News home page

ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డిదే?

Published Sat, Dec 2 2023 5:00 AM

- - Sakshi

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో తలపండిన నాయకులే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల నుంచి ఇక్కడ మరోసారి బరిలో ఉండటంతో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ టికెట్‌ లభించని కారణంగా బీఎస్పీ నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి తలపడిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో మల్‌రెడ్డి రంగారెడ్డి కేవలం 356 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌ దక్కించుకున్న మల్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో ఢీఅంటేఢీ అనే రీతిలో బరిలో నిలిచారు. అయితే ఇప్పుడు పోలింగ్‌ ముగియడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్రస్థాయిలో చర్చ కొనసాగుతోంది. ఎక్కడ ఎవరు కలిసినా ఎన్నికల ఫలితాలపై మాట్లాడుకుంటున్నారు. కొంతమంది బీఆర్‌ఎస్‌ అంటుంటే మరికొంతమంది కాంగ్రెస్‌ గెలుస్తుందని అంటుండం చర్చనీయాంశంగా మారింది.

బయటకు ధీమాగా ఉన్నా...
ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపుపై బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా...లోలోపల ఓటర్లు ఎవరికి ఓటువేశారో తెలియక తలలుపట్టుకుంటున్నారు. ఈసారి తప్పక విజయం తమనే వరిస్తుందనే ధీమాతో మల్‌రెడ్డి రంగారెడ్డి ఉండగా.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను మరోసారి గెలపిస్తాయని ధీమాగా ఉన్నారు. పోలింగ్‌ సరళిపై ఇరు పార్టీల అభ్యర్థులు తర్జనభర్జనలు పడుతూ కాకి లెక్కలు వేసుకుంటున్నారు.

ఎవరి ఓట్లు చీల్చుతారో....
సీపీఎం, బీజేపీ అభ్యర్థులు ఎవరి ఓట్లు ఎక్కువగా చీల్చుతారో అర్థంకాకుండా ఉంది. నియోజకవర్గంలో సీపీఎం, బీజేపీలు సుమారు 15వేల నుంచి 18వేల వరకు ఓటు బ్యాంకు కలిగిఉన్నాయి. 2018లో బీజేపీ అభ్యర్థికి 17 వేల పైచిలుకు ఓట్లు రాగా.. సీపీఎం అభ్యర్థికి 10వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అదేవిధంగా టీడీపీ నుంచి పోటీ చేసిన సామ రంగారెడ్డికి 18వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. ఈసారి ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండటం ఎవరికి కలిసోస్తుందో అంతుచిక్కకుండా ఉంది. వారి ఓట్లు ఏ వైపు, ఏ మేరకు దారి మరిలాయో అర్థంకాని పరిస్థితి. అయితే చాలావరకు బీజేపీ, సీపీఎం పార్టీలకు చెందిన వారు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు సమాచారం.

డబ్బుల ప్రభావం ఏ మేరకో..
ఇదిలాఉంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా డబ్బుల ప్రభావం కనిపించింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓటుకు ఇంత చొప్పున అని పంపిణీ చేసిన విషయం బహిరంగ రహస్యమే. ఈ డబ్బుల ప్రభావం అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేస్తుందా లేదా అనే విషయాన్ని ఫలితాలు వస్తేగాని స్పష్టంగా బయటపడదు. ఏదిఏమైనా ఎన్నికల ఫలితాలను ముందుగా ఉహించి చెప్పడం ఇబ్బందిగా మారింది. ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల జాతకాలు బట్టబయలు కానున్నాయి. అంతవరకు ఓపిక పట్టాల్సిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement