శంకర్‌పల్లి: రైతులు రసాయనాలతో కాకుండా, సేంద్రియ పద్ధతిలో పంటను సాగు చేస్తూ, దేశీయ కూరగాయలు పండించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పిల్లిగుండ్లలో ఉన్న సుభిషి ఫార్‌మ్స్ ఎండీ టి.వాణి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘సేంద్రియ వ్యవసాయం– దేశీయ విత్తనాల ప్రోత్సాహం’ కార్యక్రమానికి ఎంపీతో పాటు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపసంచాలకుడు డా. డి.రాజారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు ఎంతో అవకాశం ఉందని, రైతులు ఆ దిశగా ఆలోచన చేయాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఏ.నర్సింహారెడ్డి, రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ డి.ప్రకాశ్‌రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రతినిధులు లీల, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలి
మాజీ మంత్రి కేటీఆర్
మహేశ్వరం: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండల బీఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. శనివారం పెండ్యాల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్‌ను, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కార్తీక్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలని కేటీఆర్ సూచించారు. కలిసిన వారిలో నాయకులు మంత్రి రాజేశ్, మాజీ ఉపసర్పంచ్ ఎండీ.గౌస్, నట్టి రామకృష్ణారెడ్డి, నట్టి అశోక్‌రెడ్డి, నరేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


