ఇబ్రహీంపట్నం: మత్స్యకార్మికుల సమస్యలపై ఈనెల 17న నగరంలోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నర్సింహ పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రం వద్ద శనివారం ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ సమావేశాల్లో పెండింగ్‌లో ఉన్న 986 మంది మత్స్యకారులకు చెల్లించాల్సిన రూ.50 కోట్ల ఎక్స్‌గ్రేషియా, మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తున్న కార్మికులకు దశాబ్దకాలంగా ఎక్స్‌గ్రేషియా చెల్లించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. మత్స్యకార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.మల్లేష్, నాయకులు చెనమోని శంకర్, నర్సింహ, కృష్ణమూర్తి, రాజేశ్‌ఖన్నా, యాదగరి, నగేష్, కృష్ణ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


