పొంగిన మానేరు.. పారిన మూలవాగు మధ్యమానేరు నుంచి ఎల్‌ఎండీకి నీటి విడుదల మత్తడి దూకుతున్న 27 చెరువులు నిండిన 52 చెరువులు
సిరిసిల్ల: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున వర్షం జల్లులు కురిశాయి. మానేరు, మూలవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోటు వర్షపాతాన్ని అధిగమిస్తోంది. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు మత్తడి దూకేందుకు మరో మూడు అడుగుల దూరంలో ఉంది. కామారెడ్డి జిల్లాలో పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఎగువ మానేరులోకి వరద నీరు ఎక్కువగా రావడం లేదు. బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మధ్యమానేరు జలాశయం గేట్లు ఎత్తి కరీంనగర్ ఎల్‌ఎండీకి నీటి విడుదల చేశారు. మిడ్‌మానేరు నీటి నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 19 టీఎంసీలకు చేరింది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండడంతో వరదనీరు మత్తడి గుండా పారుతోంది. వెంకట్రావుపేట–బావుసాయిపేట మధ్య మట్టిరోడ్డు వరద తాకిడికి కొట్టుకుపోయింది. మూలవాగులో వచ్చే నీరు వేములవాడ మీదుగా మధ్యమానేరులోకి వెళ్తోంది. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, తంగళ్లపల్లి, గంభీరావుపేట మండలాల్లోని గ్రామాల్లో పడువాటు నీరు మానేరువాగులో కలుస్తోంది.
నిండుతున్న చెరువులు
జిల్లా వ్యాప్తంగా 656 చెరువులు ఉండగా.. ఇప్పటికే 27 చెరువులు మత్తడి దూకుతున్నాయి. మరో 56 చెరువులు వంద శాతం నిండాయి. 50 నుంచి 75 శాతం మేరకు 81 చెరువులు నిండగా.. 25 నుంచి 50 శాతం మేరకు 191 చెరువుల్లో నీరు చేరింది. 25 శాతం మేరకు 301 చెరువుల్లో నీరు చేరడం విశేషం. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రెండు చెరువులకు గండ్లు పడ్డాయి. చిన్ననీటి వనరుల పరిధిలో 44వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
ఐదు మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షం
ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే అధికంగా కురిసింది. వేములవాడ, వీర్నపల్లి, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో మెరుగైన వర్షాలు పడ్డాయి. మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఎగువ మానేరు, మధ్యమానేరు నిండి ఆయకట్టుకు నీరు విడుదల చేస్తే.. యాసంగి సీజన్ పంటలకు సాగునీరు లభిస్తుందనే ఆశలు రైతుల్లో ఉన్నాయి.
వేములవాడ/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి మూలవాగు పొంగి ప్రవహిస్తోంది. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల చిట్టివాగు ప్రాజెక్ట్ మత్తడి దూకింది. పరిసర ప్రాంత ప్రజలు చేపల వేటకు వెళ్లవద్దని జిల్లా ఫిషరీస్ డైరెక్టర్ నిమ్మల బాబు కోరారు.
మత్తడి దూకుతున్న చిట్టివాగు ప్రాజెక్ట్
వేములవాడలో నిండుగా
ప్రవహిస్తున్న మూలవాగు


