గ్యాస్‌ మాటున గుండెపోటు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ మాటున గుండెపోటు

Aug 8 2026 1:11 AM | Updated on Aug 8 2026 1:11 AM

నగరంలోని మంకమ్మతోటకు చెందిన రమేశ్‌(40) ఉదయం లేవగానే చాతిలో మంటగా అనిపించింది. మొదట గ్యాస్‌ సమస్య అనుకున్నప్పటికీ ఎంతకీ తగ్గకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలుచేయించుకోగా ఒక వాల్వ్‌ బ్లాక్‌ అయినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే స్టంట్‌ వేశారు

అతి పెద్ద కిల్లర్‌గా మారిన హార్ట్‌ ఎటాక్‌

కరీంనగర్‌లో పెరుగుతున్న కేసులు

నడక, వ్యాయామంతో నివారించే అవకాశం

జీవనశైలి, ఆహార మార్పులు తప్పనిసరి

ముందు జాగ్రత్త మేలంటున్న వైద్యులు

కరీంనగర్‌: ఛాతీలో మంటగా ఉంది. గ్యాస్‌ అయి ఉంటుంది. అజీర్ణం వల్ల నొప్పి వస్తోంది.. అంటూ చాలామంది నిర్లక్ష్యం చేసే లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెపోటుకు సంకేతాలు కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్‌ అని అనుకుని ప్రతి ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. అదే సమయంలో ప్రతి నొప్పి గుండెపోటే అని భయపడాల్సిన అవసరం కూడా లేదని చెబున్నారు. అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అంటున్నారు. గుండెపోటు చికిత్సలో శ్రీగోల్డెన్‌ అవర్‌శ్రీ అత్యంత కీలకం. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన వారిలో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు, ధూమపానం వంటి కారణాలతో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు.

యువతలో పెరుగుతున్న ముప్పు

ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపించే గుండె సంబంధిత సమస్యలు ఇప్పుడు 25 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో కూడా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, నిద్రలేమి, ఫాస్ట్‌ఫుడ్‌ అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు వంటి కారణాలు ఇందుకు కారణం అవుతున్నాయి.

గ్యాస్‌.. గుండెపోటు లక్షణాలు

గ్యాస్‌ లేదా అజీర్ణం వల్ల సాధారణంగా కడుపు ఉబ్బరం, తేపులు, భోజనం చేసిన తర్వాత అసౌకర్యం, గొంతు వరకు మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు మందులు తీసుకుంటే లేదా విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. గుండెపోటు సమయంలో ఛాతీ మధ్య భాగంలో బిగుతుగా లేదా నొక్కుతున్నట్లుగా నొప్పి ఉండవచ్చు. ఆ నొప్పి చేతులు, భుజాలు, మెడ, దవడ లేదా వీపుకు వ్యాపించవచ్చు. అధిక చెమటలు పట్టడం, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్ర నీరసం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో నొప్పి తక్కువగా ఉన్నప్పటికీ గుండెపోటు ఉండే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి...

ఛాతీలో 15 నుంచి 20 నిమిషాలకు పైగా కొనసాగే నొప్పి, ఒత్తిడి

అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

ఎడమ చేయి, మెడ, దవడకు వ్యాపించే నొప్పి

అధిక చెమటలు పట్టడం, వికారం, వాంతులు

తీవ్రమైన బలహీనత లేదా తల తిరగడం

ఈ లక్షణాలు కనిపిస్తే సమీప ఆసుపత్రికి వెంటనే వెళ్లి ఈసీజీ, 2డి ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement