● ప్రతిపాదనలోనే పనులు ● వృథాగా పోతున్న వర్షపు నీరు
వేములవాడరూరల్: ఆరేళ్ల క్రితం అత్యధిక వర్షాలు కురిసి వచ్చిన వరదతో శిథిలమైన మత్తడికి మరమ్మతులు కరువయ్యాయి. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరదకు ఎలాంటి కట్టడి లేకపోవడంతో కిందికి వెళ్లిపోతుంది. వేములవాడ మండలం మల్లారం ఆనకట్ట శిథిలం కావడంతో వర్షపు నీరు వృథాగా పోతోంది. ఈ వరద ఇక్కడ నిలిచి ఉంటే చుట్టుపక్కల ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగేవి.
1968లో నిర్మాణం
వేములవాడ మండలం మల్లారం వద్ద 1968లో మత్తడి నిర్మించారు. ఇక్కడి నుండి ఫీడర్ చానల్ మీదుగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడి చెరువుకు నీటిని మళ్లించారు. ఈ నీటితో వేములవాడ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేవి. దీంతోపాటు చెరువు కింద ఉన్న దాదాపు వందలాది ఎకరాల భూమి సాగులోకి వచ్చేది. ఇటీవల వచ్చిన వరదలతో ఈ చెక్‌డ్యామ్ మత్తడి కొట్టుకుపోవడంతో గుడిచెరువులోకి నీరు రావడం లేదు. అంతేకాకుండా ఈ మత్తడిని మరమ్మతు చేయకపోవడంతో ఫీడర్ చానల్‌లో పిచ్చిమొక్కలు, మురికినీరు నిలిచి వందల ఎకరాల భూములు కోతకు గురవుతున్నాయి.
మిడ్‌మానేరు నుంచి గుడి చెరువులోకి..
గత ప్రభుత్వ హయాంలో మిడ్‌మానేరు నుంచి గుడి చెరువులోకి నీటిని ఎత్తిపోసేందుకు రూ.4కోట్లు వెచ్చించారు. మిడ్‌మానేరు నుంచి నీటిని ఎత్తిపోయడంతో దాదాపు రూ.80లక్షల కరెంట్ బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. అదే మల్లారం ఆనకట్ట మరమ్మతులు చేపడితే ఫీడర్ చానల్ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా వర్షాకాలంలో వేములవాడ గుడి చెరువులోకి భారీగా నీరు చేరుతుంది. ఈ విషయంపై గతంలో ఆ ప్రాంత రైతులు పలుసార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ స్పందించడం లేదు.


